ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల నిర్వాహణ నిమిత్తం 2014 నుంచి 2019 మధ్య కాలంలో జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వుల (జీవోల) అమలుపై న్యాయస్థానం స్టే విధించింది. అంతేకాకుండా, ఈ జీవోల ప్రాతిపదికన ఎంపికైన లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక సహాయం లేదా చెల్లింపులు చేయరాదని స్పష్టం చేసింది.
న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్. వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. ఈ సందర్భంగా శాసనసభ ఆమోదం లేదా చట్టబద్ధమైన నిబంధనలు లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా మాత్రమే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యాంగంలోని అధికరణ 246 ప్రకారం చట్టాలను రూపొందించే అధికారం శాసనసభలకు మాత్రమే ఉంటుందని, ఆ అధికారాలను కార్యనిర్వాహక వర్గం స్వయంగా వినియోగించుకోలేదని వాదించారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాల ఆధారంగా 2014 నుంచి ఇప్పటివరకు ఈ పథకాల కోసం రూ. 13,000 కోట్లకు పైగా నిధులను వెచ్చించారని వివరించారు. గత విచారణ సమయంలో ప్రభుత్వ తరఫున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని సమయం కోరినప్పటికీ, నిర్ణీత గడువులోగా ఎలాంటి వివరాలు సమర్పించకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ న్యాయవాది మరోసారి సమయం కోరడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, జీవోల అమలుతో పాటు చెల్లింపులను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. ఇక ఈ తీర్పుతో రాష్ట్రంలోని వేలాది మంది పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధుల అందజేత తాత్కాలికంగా నిలిచిపోనుంది. ప్రభుత్వం హైకోర్టులో బలమైన కౌంటర్ దాఖలు చేయడం లేదా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారానే ఈ పథకాల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.









































