పలువురు సిక్కు ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత!

PM Narendra Modi Hosts Prominent Sikh Leaders at his Official Residence

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లో గల ప్రధాని అధికార నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రధానిని కలిసిన వారిలో ఢిల్లీ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ బాబా బల్బీర్ సింగ్ జీ సిచేవాల్, సేవాపంతి ప్రెసిడెంట్ మహంత్ కరంజిత్ సింగ్, బాబా జోగా సింగ్, సంత్ బాబా మేజోర్ సింగ్ వా, జతేదార్ బాబా సాహిబ్ సింగ్ జీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిక్కు ప్రముఖులను ప్రధాని మోదీ సత్కరించారు.

ఈ భేటీపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “ఈ ఉదయం నేను సంత్ సమాజ్ మరియు సిక్కు సమాజానికి చెందిన అనేక మంది వ్యక్తులను కలిశాను. వీరు సిక్కు సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో మరియు సమాజానికి సేవ చేయడంలో ముందంజలో ఉన్న విశిష్ట వ్యక్తులు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాలపై సిక్కు సమాజంలోని విశిష్ట సభ్యుల చెప్పిన మాటలు ఆనందాన్ని కలిగించాయి. గౌరవనీయులైన సిక్కు గురువులు నా నుండి సేవను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను మరియు వారి ఆశీర్వాదం సమాజం కోసం నన్ను మరింత పని చేసేలా చేస్తుంది” అని పేర్కొన్నారు.

కాగా పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తేదీన 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిక్కు ప్రముఖులతో ప్రధాని మోదీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ అయిన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్ )తో బీజేపీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుంది. అయితే ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ అజెండా లేదని, అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సిక్కు సమాజం కోసం ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలిపేందుకే ఈ భేటీ జరిగినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్ లో నేటితో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =