పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమిలోకి అధికారికంగా అడుగుపెట్టింది. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఘనస్వాగతం పలికారు.
గురునానక్ దేవ్ జయంతి పర్వదినం రోజున ఎన్డీఏ కూటమిని విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్న అమిత్ షా.. ఈ కలయిక హిందూ-సిక్కుల ఐక్యతకు, సోదరభావానికి గొప్ప ప్రతీక అని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అకాలీదళ్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని అమిత్ షా వెల్లడించారు.
రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కలిసి పోటీ చేస్తాయని అధికారికంగా ప్రకటించారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, అవినీతిని సమూలంగా నిర్మూలించడం మరియు జాతీయవాద శక్తులను ఏకం చేయడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పంజాబ్ రైతుల సమస్యలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానపరిచిన ఆప్‌కు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అమిత్ షా మండిపడ్డారు.
మరోవైపు, పంజాబ్ ప్రయోజనాల కోసమే భారతీయ జనతా పార్టీతో మళ్లీ చేతులు కలిపామని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. బీజేపీ-అకాలీదళ్ కలయిక కేవలం ఒక రాజకీయ పొత్తు మాత్రమే కాదని, ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన బంధమని ఆయన అన్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తమ తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్ పోరాటం చేసి బీజేపీతో కలిసి పనిచేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, యువత, కార్మికులు తీవ్రమైన సమస్యల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ మళ్లీ అభివృద్ధి పథంలోకి రావాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.







































