గ్లోబల్ సమ్మిట్‌లో సమ్మక్క సారలమ్మ తోరణాలు ఏర్పాటు చేయండి – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Orders to Set Up Sammakka Saralamma Arches at Global Summit

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ సమ్మిట్‌’కు విచ్చేసే దేశ, విదేశీ ప్రతినిధుల కోసం అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బోధి పెవిలియన్‌లో సమ్మిట్‌ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలోని తోరణాల నమూనాలను గ్లోబల్ సమ్మిట్‌ ప్రాంగణంలో ఉపయోగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసే ఈ కార్యక్రమంలో ఎక్కడా చిన్నపాటి లోపం కూడా తలెత్తకూడదని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు.

సదస్సులో సాంకేతికతకు, భద్రతకు పెద్దపీట వేయాలని సూచిస్తూ, గ్లోబల్ సమ్మిట్‌ ప్రతినిధులకు ‘ఫేసియల్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) విధానం ద్వారా ప్రవేశం కల్పించాలని సీఎం ఆదేశించారు. విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతి అతిథి కోసం ప్రత్యేక లైజనింగ్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపారు.

విదేశీ, స్వదేశీ అతిథులతో అత్యంత మర్యాదపూర్వకంగా, ఆత్మీయంగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే సదస్సు ప్రాంగణంలో నాణ్యమైన ఫుడ్ కోర్టులు, ఎక్కడా అంతరాయం కలగని మెరుగైన ఇంటర్నెట్ నెట్‌వర్క్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న ప్రత్యేక ‘ఎయిర్ షో’తో పాటు ఇతర కీలక కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం, అవగాహన పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సదస్సుకు సంబంధించిన ఆహ్వానాలు పంపే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమైన ప్రముఖులకు, పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపే బాధ్యతను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు అప్పగించాలని సూచించారు. అంతేకాకుండా దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ యూనివర్సిటీలు గ్లోబల్ సమ్మిట్‌లోని ‘ఎడ్యుకేషన్ పెవిలియన్’లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here