నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్

MLA Nandamuri Balakrishna PA Pavuluri Srinivasa Rao Detained by AP Police

మారణాయుధాలు కలిగి ఉన్నారన్న అభియోగాలపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుపై పల్నాడు పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 65 మందిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచనున్నట్లు నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు వెల్లడించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పదవి నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు నాగండ్ల రాంబాబు వర్గంతో పాటు పావులూరి శ్రీనివాసరావు వర్గం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో రాజీమార్గంలో నడిచిన ఈ రెండు వర్గాలు, సర్పంచ్ పదవి విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. శనివారం రాంబాబు వర్గీయులు, ఆదివారం శ్రీనివాసరావు వర్గీయులు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం తిమ్మాపురంలోని శ్రీనివాసరావుకు చెందిన పత్తి మిల్లులో పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. అక్కడ భారీగా కర్రలు, కత్తులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, శ్రీనివాసరావు వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు వెంటనే శ్రీనివాసరావు సహా 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ శ్రీనివాసరావు అనుచరులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెల్లాచెదురు చేశారు.

ఈ ఘటనపై నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు స్పందిస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. గుంటూరు నుంచి సుమారు 25 కార్లలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడులకు సిద్ధమై తిమ్మాపురం వద్ద తిష్ట వేసినట్లు తమకు పక్కా సమాచారం అందిందని తెలిపారు. దీనితో వెంటనే పావులూరి శ్రీనివాసరావుకు చెందిన పత్తి మిల్లుపై దాడి చేసి తనిఖీలు నిర్వహించామని, అక్కడ పట్టుబడిన వారంతా గుంటూరులోని ఒక రౌడీషీటర్ ముఠాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామని చెప్పారు.

ఘటనా స్థలం నుండి 25 కార్లతో పాటు 60 కర్రలు, నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ వివరించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 66 మందిని అరెస్టు చేసి నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఘటన స్థలం నుండి పరారైన మరో 34 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున రౌడీషీటర్ ముఠా సభ్యులు, మారణాయుధాలు పట్టుబడటంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏఎస్పీ హనుమంతరావు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here