ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశలో ఎన్నికలు నిర్వహించిన 100 పట్టణ స్థానిక సంస్థల్లో సోమవారం 87 చోట్ల డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా 84 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 57, జనసేన 19, బీజేపీ 8 పదవులను కైవసం చేసుకున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
గెలుపొందిన వారందరితో అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. అయితే కూటమి పార్టీల మధ్య అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం లోపించడం, కొన్నిచోట్ల కోరం సరిపోని కారణంగా 13 స్థానిక సంస్థల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడ మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
విశాఖ మినహా 12 కార్పొరేషన్లలో మేయర్ల ప్రమాణస్వీకారం:
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. విశాఖపట్నం నగర మేయర్‌గా ఎన్నికైన శ్రావణికి పితృవియోగం కలగడంతో ఆమె సోమవారం బాధ్యతలు చేపట్టలేదు; రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించే మరో తేదీన ఆమె ప్రమాణం చేయనున్నారు.
మిగిలిన 12 నగరపాలక సంస్థల్లో కొత్త మేయర్లు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణం చేయగా, డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ ఎన్నికయ్యారు. అలాగే 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కొత్త ఛైర్‌పర్సన్లు ప్రమాణస్వీకారం చేశారు.
పిఠాపురంలో రసాభాస.. ఎంపీ పీఏపై దాడి:
అధిక శాతం పట్టణ సంస్థల్లో కూటమి పార్టీలు పొత్తు ధర్మాన్ని పాటించినప్పటికీ, పిఠాపురం, నిడదవోలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు తదితర పట్టణాల్లో తీవ్ర ఉద్రిక్తతలు, అసంతృప్తులు బయటపడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం మున్సిపాలిటీలో వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక రోజంతా రసాభాసగా మారింది. అధిష్ఠానం ప్రకటించిన జనసేన అభ్యర్థి బొజ్జా వెంకటేశ్వరరావును మెజారిటీ కౌన్సిలర్లు వ్యతిరేకించి, మరో అభ్యర్థి పేరును ప్రతిపాదించారు.
కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రంగంలోకి దిగి కౌన్సిలర్లతో చర్చలు జరిపి విప్ జారీ చేయడంతో చివరకు వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. అయితే ఈ వివాదాలకు ఎంపీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చక్రి కారణమంటూ కొందరు జనసేన కార్యకర్తలు అతనిపై దాడికి దిగడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఠాణా వద్ద ఉద్రిక్తత నెలకొంది.
పలాస, రాజంపేట, నాయుడుపేట, సాలూరులో వాయిదా ట్విస్ట్‌లు:
పలు చోట్ల స్థానిక నేతల మధ్య సమన్వయ లోపంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో కూటమికి 32 మంది బలమున్నా, జనసేన నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడం, సభ్యులు వెళ్లిపోవడంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. రాజంపేటలో టీడీపీ బీఫారం ఇచ్చిన అభ్యర్థి షబీనా తనకు పదవి వద్దని ప్రకటించడం, కౌన్సిలర్లు మరో అభ్యర్థిని ప్రతిపాదించడంతో గందరగోళం నెలకొని ఎన్నిక నిలిచిపోయింది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో బీజేపీ అభ్యర్థి పోటీని టీడీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. ఇక సాలూరులో ఛైర్‌పర్సన్ పదవి దక్కించుకున్న జనసేన, పొత్తు ప్రకారం టీడీపీకి కేటాయించిన వైస్ ఛైర్‌పర్సన్ పదవికి మద్దతు ఇవ్వకపోవడంతో అక్కడ కూడా ఉత్కంఠ నెలకొంది. వాయిదా పడిన 13 చోట్ల నేడు జరగనున్న ఎన్నికల్లో పొత్తు ధర్మం అమలయ్యేలా కూటమి అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది.



































