భారత్‌లో రెండేళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల డిసెంబర్ 16న తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. బంగ్లాదేశ్ 1971 విమోచన యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన సందర్భంగా ఏటా డిసెంబర్ 16న ఆ దేశంలో ‘విక్టరీ డే’ (విజయ దినోత్సవం) ఘనంగా నిర్వహిస్తారు.
సరిగ్గా అదే చారిత్రాత్మక రోజును ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఎంపిక చేసుకోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు షేక్ హసీనా ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 ఆగస్టు 5న జరిగిన విద్యార్థుల తిరుగుబాటు అనంతరం బంగ్లాదేశ్ విమానంలోనే ఆమెను భారత్‌కు పంపించారని, రాజ్యాంగానికి విరుద్ధంగా బహిష్కరించినందున ఇప్పుడు డిసెంబర్ 16న విక్టరీ డే నాడు తిరిగి ఢాకాకు చేరుకునేందుకు ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు చేయాలని హసీనా డిమాండ్ చేశారు.
ఢిల్లీ నుండి ఢాకాకు బంగ్లాదేశ్ జాతీయ విమానయాన సంస్థ ‘బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్’లో ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో పాటు, రద్దు చేసిన తన పాస్‌పోర్ట్ మరియు ఇతర ప్రయాణ పత్రాలను వెంటనే జారీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
మరోవైపు, షేక్ హసీనా ప్రకటన బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ, న్యాయపరమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై అక్కడ ఇప్పటికే నిషేధం కొనసాగుతుండగా, 2024 నిరసనల అణచివేత కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్‌లో బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలోనే మరణశిక్ష విధించింది.
అయితే ఈ ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని హసీనా కొట్టిపారేస్తున్నారు. ఇటీవల ఆమె కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు, అవామీ లీగ్ మద్దతుదారుల నిరసనలు పెరిగాయి.
అడుగిడితే జైలుకే.. బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక
అయితే మరోవైపు హసీనా ప్రకటనపై బంగ్లా ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల డిసెంబర్ 16న బంగ్లాదేశ్ లిబరేషన్ డే సందర్భంగా స్వదేశానికి తిరిగి వస్తానని ఆమె చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఢిల్లీ నుంచి ఢాకాకు ప్రయాణించేందుకు విమానంతో పాటు అవసరమైన పత్రాలు ఏర్పాటు చేయాలన్న హసీనా విజ్ఞప్తిని నిరాకరించింది. అంతేకాకుండా, ఆమె బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలిస్తామని హెచ్చరించింది.
షేక్ హసీనా సాధారణ ప్రయాణికురాలు కాదని, కోర్టు శిక్ష విధించిన నేరస్థురాలని పేర్కొంటూ, దేశంలోకి వచ్చిన వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.
ఇక ఇప్పటికే భారత్ నుండి ఆమెను అప్పగించాలని (ఎక్స్ట్రాడిషన్) బంగ్లాదేశ్ అధికారికంగా కోరగా, ఆ అభ్యర్థనను న్యాయపరంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ క్లిష్ట పరిస్థితుల నడుమ డిసెంబర్ 16న షేక్ హసీనా ఢాకాకు తిరిగి వెళ్లే అంశం దక్షిణాసియా రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.






































