ముగిసిన తొలిదశ పోలింగ్: 6 గంటలకు బెంగాల్ లో 79.79, అస్సాంలో 72.14 శాతం

West Bengal and Assam Assembly elections : First Phase Polling Underway

–> పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో తోలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పశ్చిమబెంగాల్ లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ లోని వెస్ట్ మెడినిపూర్ జిల్లా‌లో పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి.

 

  • పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా పురులియా, బంకురా, ఈస్ట్ మెడినిపూర్, వెస్ట్ మెడినిపూర్, జార్గ్రామ్ జిల్లాలలోని 30 అసెంబ్లీ స్థానాలలో శనివారం నాడు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 30 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ తొలిదశలో బెంగాల్ లో సుమారు 73 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్‌ బూత్‌ల వద్ద బారులు తీరారు.
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో 10,288‌ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్‌ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఈవీఎంలను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నారు. బెంగాల్లో ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్యే కీలక పోటీనెలకుంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు బెంగాల్లో ఫేజ్-2 ఏప్రిల్ 1, ఫేజ్-3 ఏప్రిల్ 6, ఫేజ్-4 ఏప్రిల్ 10, ఫేజ్-5 ఏప్రిల్ 17, ఫేజ్-6 ఏప్రిల్ 22, ఫేజ్-7 ఏప్రిల్ 27, ఫేజ్-8 పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. మే 2 వ తేదీన ఓట్లలెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

–> ఇక అస్సాం రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, శనివారం తొలిదశలో భాగంగా 12 జిల్లాల పరిధిలో 47 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతుంది‌. తొలిదశలో 264 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 81,09,815 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 11,537 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అస్సాంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి (కాంగ్రెస్, ఏఐయూడిఎఫ్, సీపీఐ ఎంఎల్-ఎల్, ఆర్జేడీ, సీపీఎం(ఎం), సీపీఐ, బిపిఎఫ్, ఆన్చాలిక్ ఘనమోర్చా) మరియు బీజేపీ-ఏజీపీ కూటమి మధ్యే ప్రధాన పోటీ నెలకుంది. మరోవైపు ఏజేపీ-రైజొర్‌దళ్‌ కూటమి కూడా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 1 న, మూడో విడత పోలింగ్ ఏప్రిల్ 6న జరగనుంది. ఎన్నికల ఫలితాలను మే 2న వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =