కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష: ప్రజలకు సూచనలు, వైద్యారోగ్య శాఖపై కీలక నిర్ణయాలు

CM KCR Review Meeting, CM KCR Review on Corona Control Measures, Corona Control Measures, Corona Control Measures In Telangana, Corona Control Measures Telangana, KCR Meeting Over Corona Control Measures, telangana, Telangana Corona Control Measures, Telangana Coronavirus

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 17, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని అన్నారు. కరోనా వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్సలోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిన పలు సూచనలు:

 • కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు.
 • రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ తో చికిత్స అందిస్తున్నాం.
 • దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి.
 • తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉంది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి.
 • రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు.
 • అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
 • ప్రజలు హైరానా పడి అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి.
 • తెలంగాణ రాష్ట్రంలో పి.హెచ్.సి. స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి.
 • కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానిక ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉంది.

వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు:

 • కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారు.
 • వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు.
 • కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.
 • ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.
 • ఔటో సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం (కోవిడ్ ఇన్సింటివ్) కొనసాగించాలని ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బందికి ఇన్సెంటివ్ లకు కొనసాగించాలని నిర్ణయించారు.
 • రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 • పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.
 • కరోనా సోకిన వారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెయ్ డిస్ట్రిర్, టో సిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావి పిరావిర్ టాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలి. కావాల్సిన వారికి ఉచితంగానే అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దు.
 • ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలి.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =