రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈ రోజు (మే 27, బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ వర్షా కాలం సీజన్ నుంచి రాష్ట్రంలో అమలు చేసే నియంత్రిత పంటల సాగు విధానం, రాష్ట్ర అవతరణ వేడుకలు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 31 తో ముగియనున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్ కార్యాచరణ, ప్రణాళికల అమలుపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆంక్షలను పరిమితం చేసి లాక్డౌన్ అమలు మరియు రాత్రిపూట కర్ఫ్యూని మరికొన్ని రోజులు కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు, హైదరాబాద్ లో సిటీ బస్సులు, మెట్రో సేవలు, పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 2 న రాష్ట్ర అవతరణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే నియంత్రిత పంటల సాగు విధానం పూర్తిస్థాయి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించి, ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu