నేడు ఇందిరమ్మ చీరలు, కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy To Launch Indiramma Sarees and New Cheyutha Pensions Distribution in Achampet Today

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (నవంబర్ 26) నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గం, జిల్లా పరిధిలో సుమారు రూ.450 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా మద్దిమడుగుకు చేరుకునే ముఖ్యమంత్రి, అక్కడ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు రూ.38 కోట్లతో శ్రీకారం చుట్టనున్నారు. అలాగే శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.18 కోట్లు, ఆలయం సమీపంలో హరిత హోటల్ నిర్మాణానికి రూ.15 కోట్ల అంచనా పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

మద్దిమడుగు పర్యటన అనంతరం అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణం నుంచి పలు కీలక మౌలిక సదుపాయాల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో జిల్లా పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.274.32 కోట్లు, నాగర్‌కర్నూల్, పెద్ద కొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ.29.65 కోట్లు, అచ్చంపేట మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు కేటాయించారు.

వీటితో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు గదుల నిర్మాణానికి రూ.18.10 కోట్లు, అచ్చంపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా మౌలిక సదుపాయాలకు రూ.16 కోట్లు, ఆమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ.14 కోట్లు, అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం బహిరంగ సభ వేదికగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలకు (గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది, పట్టణాల్లో 35 లక్షల మందికి) ఆధునిక డిజైన్లతో కూడిన చీరలను పంపిణీ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెల్ల రేషన్ కార్డు కలిగి 18 ఏళ్లు నిండిన మహిళలకు రేషన్ కార్డు, ఆధార్ వివరాల ఆధారంగా, ప్రత్యేక యాప్ ద్వారా ధ్రువీకరించి చీరలను అందజేయనున్నారు.

ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ‘చేయూత’ పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని కూడా ముఖ్యమంత్రి ఇదే వేదికపై నుంచి ప్రారంభించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఒకేసారి ముందుకు తీసుకెళ్తూ నిర్వహిస్తున్న ఈ పర్యటనపై నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here