అనకాపల్లిలో రూ.47,009 కోట్లతో భారీ డేటా సెంటర్.. ఆమోదించిన చంద్రబాబు సర్కార్

CM Chandrababu Chairs SIPB Approves 720 MW Data Center Worth Rs.47,009 Cr in Anakapalli

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లాలో 720 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. బాలేవాడి టెక్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.47,009 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది.

ఈ నేపథ్యంలో ఈ మెగా ప్రాజెక్టు కోసం అనకాపల్లి జిల్లాలోని తూలిపాళ్ల వద్ద 200 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తాజాగా జరిగిన 24వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

మరోవైపు, విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా మరింత బలోపేతం చేసే దిశగా కాపులుప్పాడ వద్ద నూతన ‘ఐటీ హబ్’ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.2,187 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఐటీ హబ్ కోసం కాపులుప్పాడలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అనకాపల్లి డాటా సెంటర్ మరియు విశాఖ ఐటీ హబ్.. ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 29,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

వీటితో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. కియా ఇండియా, సెయింట్ గోబైన్, ఏటీసీ టైర్స్, జెంటారి మరియు అదానీ ఎంటర్‌ప్రైసెస్ వంటి ప్రముఖ కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మొత్తంగా 17 సంస్థలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రూ.88,392.60 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని అధికారులు వెల్లడించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ రంగం, పర్యాటక రంగం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. ఈ 17 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54,210 మంది యువతకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here