సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి సాగు నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు. ఈ మేరకు ఆదివారం భారీ ఎత్తున నిర్వహించిన ‘రైతు మహా పాదయాత్ర’లో పాల్గొన్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని అనంతగిరి జలాశయం (అల్లీపూర్ ఎల్లమ్మగుడి) నుంచి రంగనాయకసాగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర స్థానిక రైతులు, భారాస శ్రేణులు ఈ ప్రతిష్టాత్మక పాదయాత్ర చేపట్టారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు చివరి కిలోమీటరున్నర దూరం రైతులతో కలిసి నడిచారు. అనంతరం రంగనాయకసాగర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా రాజకీయాలను పక్కనబెట్టి మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్న నీటిని ఎత్తిపోసేందుకు కాళేశ్వరం మోటార్లను తక్షణమే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో భారీగా వరద నీరు వృథాగా కిందికి పోతున్నా ప్రభుత్వం మీట నొక్కకపోవడం వల్ల ప్రాజెక్టులు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరవు కాలంలో నీటిని ఎత్తిపోయకపోతే ఎల్లంపల్లి ఎండిపోయి రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు కూడా తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కరవు పరిస్థితులపై ప్రభుత్వానికి సరైన సూచనలు చేసిన విశ్రాంత ఇంజినీర్లను జైల్లో పెడతామని, బెల్టుతో కొడతామని బెదిరించడం పాలకుల అనాగరిక చర్యకు నిదర్శనమన్నారు. దేవుళ్లపై ఒట్టుపెట్టి హామీలను తప్పినందుకే రాష్ట్రంలో కరవు తాండవిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో అసెంబ్లీ వేదికగా రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఆచరణలో కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. మూడు పంటలకు ఇవ్వాల్సిన రూ.19 వేల కోట్ల రైతుబంధు నిధులను నిలిపివేసి అన్నదాతలను నిలువునా ముంచారని మండిపడ్డారు. ఎరువుల పంపిణీకి కొత్తగా యాప్‌లు పెట్టి రైతులను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి పూర్తిగా దళారులు, రైస్‌మిల్లర్ల చేతుల్లో తోలుబొమ్మగా మారిపోయారని దుయ్యబట్టారు.
ఈ పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసం భారాస పెట్టింది కాదని, చిన్నకోడూరు మండల రైతుల స్వచ్ఛంద ఆవేదన అని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాలకు కాళేశ్వరం నీటిని విడుదల చేయకపోతే రైతాంగం మొత్తం రోడ్లపైకి వచ్చి పోరాడుతుందని హెచ్చరించారు.





































