హైదరాబాద్‌కు 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు.. పోలీసు శాఖ హై అలర్ట్!

Hyderabad on High Alert Police Step Up Security After 2611-Style Threat Mail

హైదరాబాద్ నగరంలో 2008 నాటి 26/11 ముంబై ఉగ్రదాడుల తరహాలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పేర్కొంటూ పోలీసు శాఖ పేరిట వెలుగులోకి వచ్చిన ఒక అలర్ట్ సందేశం తీవ్ర కలకలం రేపింది. 2026 నవంబర్ 21 తేదీతో ఉన్న ఈ సందేశంలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) పేరుతో ఈ-మెయిల్ అందినట్లు వివరించారు.

కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా మరియు కాచిగూడ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లు జరుపుతామని, ఈ దాడుల్లో కనీసం 300 మందిని హతమార్చడమే తమ ప్రధాన ఉద్దేశమని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించినట్లు ఆ అలర్ట్ సందేశంలో పేర్కొన్నారు.

ఈ బెదిరింపు వెనుక ప్రతీకార కారణాలను కూడా ఆ మెయిల్‌లో ప్రస్తావించినట్లు అలర్ట్ ద్వారా తెలుస్తోంది. భారత సైన్యం ఇటీవల తమ నాయకుడు లతీఫ్ భట్, అతని ఇతర సహచరులను హతమార్చినందుకు ప్రతీకారంగానే ముంబై తరహా దాడులను హైదరాబాద్‌లో పునరావృతం చేస్తామని ఆ మెయిల్‌లో హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో.. నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి కీలక సూచనలు జారీ చేసినట్లు సమాచారం.

పోలీసు శాఖ ఆదేశాల మేరకు, కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాతో పాటు నగరంలోని రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలు, హోటళ్లు, ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాలు, ముఖ్యమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల వద్ద నిఘాను భారీగా పెంచారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, నిర్లక్ష్యంగా వదిలేసిన బ్యాగులు లేదా వస్తువులు, అనుమానిత వాహనాలు మరియు అసాధారణ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. నగరవ్యాప్తంగా పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో యాంటీ సబోటేజ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

అలాగే, సంబంధిత ఇతర భద్రతా విభాగాలు, నిఘా సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మి భయాందోళనలకు గురికావద్దని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here