ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్లాటినం జూబ్లీ వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ

PM Modi Says, I Challenge The Challenges at IIT Kharagpur Platinum Jubilee Celebrations

తాను సవాళ్లకే సవాలు విసిరే వ్యక్తినని, సవాళ్లను ఎదుర్కోవడం, వాటిని అధిగమించడం ఎప్పుడూ ఆపలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలోనే తొలి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఖరగ్‌పుర్‌) ప్లాటినం జూబ్లీ (75 ఏళ్ల) వేడుకలకు శనివారం (నవంబర్ 21) ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల కోసం నిర్బంధ శిబిరం ఉన్న ప్రాంతంలోనే ఐఐటీ ఖరగ్‌పుర్‌ను నిర్మించారని గుర్తుచేస్తూ.. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ సంస్థ ఎన్నో మైలురాళ్లను సాధించి, దేశాభివృద్ధిలో, ఆవిష్కరణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

గత 12 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచిందని, పేద ప్రజలను శక్తిమంతం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో పేదరిక నిర్మూలన అంశం ఎర్రకోట వేదికగా ప్రసంగాలు, ఫైళ్ల రూపకల్పనకే పరిమితమయ్యేదని విమర్శించారు. అయితే గత 12–13 ఏళ్ల కాలంలో 50 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించిందని, తమ ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.

తాను సెమీకండక్టర్ మిషన్ గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది ఆలస్యమైందని వ్యాఖ్యానించారని, కానీ నేడు ఆ రంగంలో భారత్ ముందంజలో నిలిచిందని అన్నారు. విద్యార్థులతో పాటు దేశ భవిష్యత్తుకు రాబోయే రెండు దశాబ్దాలు అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు.

1951లో స్థాపించిన ఐఐటీ ఖరగ్‌పుర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక వెండి నాణేన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు ’75 వాయిసెస్ ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 75 మంది విద్యార్థులతో ప్రధాని ఆత్మీయంగా ముచ్చటించి వారి అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకున్నారు.

కార్యక్రమం అనంతరం ఐఐటీ ఖరగ్‌పుర్ విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలు, స్టార్టప్ ప్రాజెక్టులు, పరిశోధనా నమూనాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. వ్యవసాయం, వస్త్ర పరిశ్రమ, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డ్రోన్ సాంకేతికత మరియు వైద్య రంగాలకు సంబంధించిన వినూత్న ప్రాజెక్టుల గురించి విద్యార్థులు, పరిశోధకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here