భారత్-నేపాల్ దేశాల మధ్య రైల్వే అనుసంధానాన్ని, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో చారిత్రక అడుగు పడింది. శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, సీతాదేవి జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌లను నేరుగా అనుసంధానించే కొత్త వీక్లీ రైలు ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’ను ఈరోజు (నవంబర్ 23) భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఢిల్లీ నుండి వర్చువల్‌గా ప్రారంభించారు.
అయోధ్యలో జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయోధ్య కంటోన్మెంట్ నుంచి జనక్‌పూర్ ధామ్ వరకు సుమారు 604 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు దాదాపు 19 గంటల్లో చేరుకుంటుంది. మధ్యలో ఎక్కడా రైలు మారాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు నేరుగా గమ్యస్థానానికి చేరుకునేలా దీనిని రూపొందించారు.
నవంబర్ 28 నుండి సాధారణ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి సోమవారం సాయంత్రం 5:50 గంటలకు అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు (నేపాల్ కాలమానం ప్రకారం) జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం మధ్యాహ్నం 1:10 గంటలకు జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 8:10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది.
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. అయోధ్య ధామ్, మన్కాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామర్హి, శిషో, మధుబని, జయనగర్ స్టేషన్లలో దీనికి హాల్ట్‌లు కల్పించారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం మొత్తం 17 ఆధునిక LHB కోచ్‌లతో ఈ రైలు నడవనుంది. ఇందులో 8 ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లు, దివ్యాంగులకు అనుకూలమైన ఒక లగేజీ కోచ్ మరియు పవర్ కార్ అందుబాటులో ఉంటాయి.
ఈ నూతన రైలు సౌకర్యం వల్ల ఇరు దేశాల భక్తులు, పర్యాటకులు రామాయణ సర్క్యూట్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఎంతో సులభంగా సందర్శించే వీలు కలుగుతుంది. దీనివల్ల ఉత్తరప్రదేశ్, బిహార్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక వ్యాపారులు, పర్యాటక నిర్వాహకులు, హస్తకళాకారులకు ఉపాధి మరియు ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా విద్య, వ్యాపార, కుటుంబ అవసరాల కోసం సరిహద్దు దాటి ప్రయాణించే ఇరు దేశాల ప్రజలకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.







































