రాష్ట్రానికి ద్రోహం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కూడా అడ్డమైన రాతలు రాస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకువస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ మేరకు శనివారం (నవంబర్ 21) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసమే వైసీపీ చరిత్ర అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెళ్లికి ఆహ్వానపత్రిక అందిస్తే సొంత చెల్లిపై అడ్డమైన రాతలు రాస్తారా? కుమార్తె పెళ్లికి షర్మిల నన్ను ఆహ్వానిస్తే రోత రాతలేంటి?” అంటూ ఆయన నిలదీశారు.
రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, తనకు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మధ్య మానవ సంబంధాలు ఎన్నడూ దెబ్బతినలేదని, తామిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేశారు. ఇంత దారుణంగా కుటుంబ బంధాలను అవమానిస్తారా అంటూ సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత బంధాలు, ఆహ్వానాల విషయంలో హద్దులు దాటి అసభ్యకరమైన రాతలు రాయడం అత్యంత దురదృష్టకరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మానవీయ విలువలు, మర్యాదలను కాపాడుతూ, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.




































