రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది

Education Minister Sabitha Indra Reddy, Educational Institutions, KTR, KTR Meeting With Representatives of Educational Institutions, Minister KTR, Minister Sabitha Indra Reddy, Representatives of Educational Institutions, Sabitha Indra Reddy, Sabitha Indra Reddy Meeting with Representatives of Educational Institutions, Telangana Educational Institutions

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న వివిధ స్థాయిల్లోని విద్యాసంస్థల్లో ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూనే, మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో నిరంతరం చర్చలు కొనసాగిస్తూ అందరికీ నాణ్యమైన విద్య కోసం ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు వివిధ రకాల కోర్సులు అందిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుసరించాల్సిన చర్యలతో పాటు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూలంకషంగా చర్చించారు.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య సంఘాలు పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ మరియు ఫార్మా కోర్సుల కాలేజీల యాజమాన్యాల సంఘాలు సైతం పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఒకేషనల్ మరియు బీఈడీ, టీటీసీ కాలేజీలతో పాటు జూనియర్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్య సంఘాల ప్రతినిధులు సైతం తమకు ఉన్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం చూపాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు అన్నింటినీ కూడా విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా పూర్తిగా చెల్లించామని ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ అన్నారు. ఒకవైపు విద్యా కార్పొరేటీకరణ ను పూర్తిగా వ్యతిరేకిస్తూనే గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకున్న వారి పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నామన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులైన వేలాదిమందికి చిన్న, మధ్యతరహా విద్యాసంస్థలు గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని తాము గుర్తించామన్నారు. విద్యాసంస్థల యాజమాన్యం సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని, అదే సమయంలో వివిధ అంశాలపైన ప్రభుత్వంతో కలిసి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రులు అన్నారు. విద్యారంగంలో ప్రమాణాల పెంపు కోసం సానుకూల మార్పు దిశగా చేపట్టే చర్యలను ఖచ్చితంగా ఆహ్వానించాలని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభ సమయంలో విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు పైన తల్లిదండ్రుల నుంచి తమకు అనేక సలహాలు, సూచనలు వస్తున్నాయని వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. దీంతో పాటు జీవనోపాధి కోసం ఆయా విద్యా సంస్థలో పనిచేస్తున్న లెక్చరర్లు టీచర్లకు సంబంధించిన జీతభత్యాల విషయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు కొంత ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యాసంస్థల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు మరియు ఐటీ శాఖ తరఫున అవసరమైన సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తరఫున మరింత శిక్షణ ఇచ్చి వారికి కంపెనీలలో ప్లేస్ మెంట్ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి కేటిఆర్ సూచించారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలను వాటి పరిష్కారం కోసం ఇంత పెద్ద ఎత్తున ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం పట్ల విద్యాసంస్థల యాజమాన్యం సంఘాల ప్రతినిధులు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

మూడు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో తాము కొనసాగుతున్నామని ఇంతటి విస్తృతమైన చర్చను ఏ ప్రభుత్వం తమతో చేపట్టలేదని ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలు తెలుసుకుని తమ సమస్యల పట్ల సావధానంగా, సానుకూలంగా పరిశీలించడం పట్ల వారంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశానికి మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ వినోద్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటరీలు, విద్యాసంస్థల యాజమాన్యం సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =