పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం మొదలైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం జరిగిన అట్టహాసమైన వేడుకలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా సువేందు బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని సుదీర్ఘ పాలనకు స్వస్తి పలుకుతూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర పగ్గాలను దక్కించుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమ విశేషాలు:
అగ్రనేతల సమక్షంలో వేడుక
ఈ చారిత్రాత్మక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సహా హోంమంత్రి అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు మరియు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ఈ వేడుకలో పాల్గొని సువేందు అధికారికి అభినందనలు తెలిపారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో లక్షలాది మంది ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల సమక్షంలో గవర్నర్ ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఏపీ సీఎం చంద్రబాబు సందడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఉదయం కోల్‌కతా చేరుకున్న ఆయన, వేదికపై జాతీయ నాయకులతో కలిసి సందడి చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు రాక, ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఉత్తరప్రదేశ్ ముఖ్యంమత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా వేదికపై సందడి చేశారు.
సువేందు అధికారి రాజకీయ ప్రస్థానం
సువేందు అధికారి మమతా బెనర్జీపై వరుస విజయాలు సాధించి బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. గతంలో నందిగ్రామ్‌లోనూ, తాజా ఎన్నికల్లో ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీని ఓడించి ఆయన సంచలనం సృష్టించారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సువేందు, ఇప్పుడు ఆమెను ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం విశేషం.
బెంగాల్‌లో కొత్త శకం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సువేందు అధికారి మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. బెంగాల్‌ను మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.









































