దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా చేస్తా – సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Launches Several Major Developmental Projects at Kodangal Today

దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన శుక్రవారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యంగా విద్యా, ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక రంగాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

పేదల తిరుపతిగా కొడంగల్

కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ‘తెలంగాణ పేదల తిరుపతి’గా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. ఆగమశాస్త్ర పండితుల సూచనల మేరకు, తిరుమలలో జరిగే తరహాలోనే ఇక్కడ కూడా పూజలు నిర్వహించేలా ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా కోస్గి వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాల ద్వారా కొడంగల్‌కు దేశస్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సాగునీరు మరియు పారిశ్రామికాభివృద్ధి

కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అన్ని అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల కొరత లేదని, రాబోయే ఏడాదిన్నర కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పారిశ్రామిక రంగానికి ఊతమిస్తూ, రేకులపాడు ప్రాంతంలో రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అలాగే కృష్ణ-వికారాబాద్ రైల్వేలైన్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

విద్యా హబ్ మరియు మౌలిక సదుపాయాలు

లగచర్ల ప్రాంతంలో సుమారు 220 ఎకరాల్లో భారీ ‘ఎడ్యుకేషన్ హబ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ అనేక ప్రముఖ విద్యాసంస్థలను నెలకొల్పి, వెనుకబడిన ఈ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా మారుస్తామన్నారు. ఆరోగ్య రంగంలో భాగంగా 430 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి, 2034 వరకు అందరూ ఐకమత్యంతో పనిచేయాలని, కొడంగల్‌ను ఒక నందనవనంలా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలను కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here