రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి పర్యవేక్షణ మరియు రైతు సమస్యలు తీర్చడానికి, తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొదటగా ఈ రైతు సమన్వయ సమితికి గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌ గా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వచ్చే జూన్ నెలలోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం నిర్ణయించారు.

క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు నాలుగు రోజులలోనే వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =