పుట్టింటి వాళ్లు తరిమేస్తే.. అత్తింటి వాళ్లు అక్కున చేర్చుకుని, కడుపులో పెట్టుకుని చూసుకున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సామాన్య ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని, ప్రజల హక్కుల కోసం రెండు దశాబ్దాల పాటు పనిచేసిన తనను పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవులు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయలేదని, తెలంగాణ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా నిజామాబాద్ నగరంలో నిర్వహించిన భారీ ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె కీలక ప్రసంగం చేశారు.
బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నినాదాలకే పరిమితమైన బంగారు తెలంగాణ కాదని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించే బహుజన తెలంగాణ అవసరమని కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు మారతాయని ఆశించిన ప్రజలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని కులాలు, అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా సామాజిక, ఆర్థిక న్యాయం జరగాలని స్పష్టం చేశారు.
సొంత గడ్డపై భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న కవిత
కొత్త పార్టీ ఏర్పాటైన తర్వాత నాలుగు నెలలకు సొంతూరు నిజామాబాద్‌కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కవిత అన్నారు. అయితే తనకు అండగా నిలిచిన ప్రజలను చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు రావడం సహజమేనని, అయితే తనను పిరికిదానిగా భావించవద్దని వ్యాఖ్యానించారు. ఎలాంటి తప్పు చేయలేదని, కష్టసమయాల్లోనూ ధైర్యంగా నిలబడ్డానని తెలిపారు.
ఉచిత విద్య, వైద్యం కోసం పాంచజన్య కార్యాచరణ
తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ‘పాంచజన్యం’ పేరుతో ఐదు కీలక అంశాలతో కార్యాచరణ రూపొందించామని కవిత వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రానికి ఏటా వచ్చే ఆదాయంలో గణనీయమైన భాగాన్ని విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయపడ్డారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని, భవిష్యత్‌లో నిజామాబాద్ జిల్లాలో పార్టీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు.
ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డిపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన తండ్రి కేసీఆర్‌కు మధ్య దూరం పెరగడానికి ఆయనే కారణమని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావులను క్షమించే అవకాశం ఉండవచ్చని, అయితే ప్రశాంత్ రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించబోనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు
గత పదేళ్లలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు అమలు కాలేదని విమర్శించారు. మరోవైపు, ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ తన రాజకీయ లక్ష్యాలకే పరిమితమైందని ఆరోపించారు.
నిజామాబాద్ ప్రజలే తనకు నిజమైన బలమని పేర్కొన్న కవిత, ఈ ప్రాంత కోడలిగా జిల్లా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ రక్షణ సేన అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.






































