గుర్తు పెట్టుకోండి.. మేము టీఆర్ఎస్ 2.0 – కల్వకుంట్ల కవిత

TRS Chief Kalvakuntla Kavitha Sensational Remarks on AP Leaders

తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పక్షాలు మరియు ఆంధ్రా నేతలపై అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, గుర్తింపును దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తాము సహించేది లేదని ఆమె తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

రాజధాని లేక డైవర్షన్ పాలిటిక్స్: కవిత

రాష్ట్ర విభజన జరిగి దాదాపు 13 ఏళ్లు కావస్తున్నా ఆంధ్రా పాలకులకు ఇప్పటివరకు ఒక స్థిరమైన రాజధానిని నిర్మించుకోవడం చేతకాలేదని కవిత ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆంధ్రా నేతలు నిరంతరం ‘డైవర్షన్ పాలిటిక్స్’ (మళ్లింపు రాజకీయాలు) ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో నవ నిర్మాణ సభలు పెట్టే ముందు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సినిమా షూటింగ్‌లు చేసుకోండి, నాలుగు డైలాగులు చెప్పుకుని పోండి, అంటే కానీ.. ఇక్కడి రాజకీయాల్లో వేలు పెడతామంటే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. గుర్తు పెట్టుకోండి.. మేము టీఆర్ఎస్ 2.0 అని హెచ్చరించారు కవిత.

ఆంధ్రా నేతల విగ్రహాల పార్సల్

తెలంగాణ గడ్డపై ఆంధ్రాకు చెందిన రాజకీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నేతల విగ్రహాలన్నింటినీ తొలగించి, వాటిని భద్రంగా ఆంధ్రాకే పార్సల్ చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు.

మా రాజకీయాల్లో వేలు పెడితే సహించం

తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే వారికి లేదా ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా ప్రజలందరికీ తాము ఎల్లప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తామని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కవిత స్పష్టం చేశారు. అయితే వ్యాపారాలు దాటి మా నీళ్లు, మా నిధులు మరియు మా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాలని చూస్తే మాత్రం ఎంతమాత్రం సహించేది లేదని కరాఖండిగా చెప్పారు.

ఈ సందర్భంగా తాను చాలా మొండిదాన్నని, వారు అనుకున్నంత మంచిదాన్ని కాదంటూ హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా పాలకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, కేకే, పీకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను తొక్కేస్తున్నారని విమర్శించారు.

 ఇక తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రా పొలిటికల్ లీడర్స్ పై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్ర రాజకీయాల్లో వేడి రగిల్చాయి. అయితే, కవిత వ్యాఖ్యలపై ఆంధ్రా నాయకులెవరూ ఇప్పటివరకు స్పందించలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here