కేంద్రం కీలక నిర్ణయం.. రేపు లోక్‌సభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు

Centre to Be Presented Amaravati Legitimacy Bill in Parliament Tomorrow

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. ఏపీ పునర్విభజన చట్టం, 2014 సవరణ బిల్లును రేపు (ఏప్రిల్ 1) లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి లోక్‌సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును కేంద్ర హోం శాఖ అధికారులు ఇప్పటికే చేర్చారు.

ఈ నేపథ్యంలో ముందుగా రేపు ఈ బిల్లు కేంద్ర కేబినెట్‌లో స్వల్ప చర్చ అనంతరం ఆమోదం పొంచనుంది. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్‌లో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు పేరుతో కేంద్రం సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో బుధవారమే దీనికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని, ఒకవేళ ఏదేని కారణంగా అలా వీలుపడని పక్షంలో గురువారం (ఏప్రిల్ 2) నాటికి ఉభయ సభల్లోనూ ఆమోదం లభిస్తుందని పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి.

బిల్లులోని ముఖ్యాంశాలు:
  • చట్ట సవరణ: 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ 2కు కేంద్రం సవరణలు చేస్తోంది. దీని ద్వారా ‘అమరావతి’ని ఏపీ రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తున్నారు.

  • స్పష్టత: ఏపీ సీఆర్డీఏ (CRDA) చట్టంలోని క్యాపిటల్ ఏరియా పరిధిలోనే అమరావతి నగరం ఏర్పడుతుందని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.

  • రాష్ట్ర ప్రభుత్వ పాత్ర: రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలని కోరుతూ 2026, మార్చి 28న (శనివారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం, సభ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది.

  • ఈ తీర్మానంలో ప్రధానంగా ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 5(2)లో ‘కొత్త రాజధాని’ అనే పదం ఉన్న చోట ‘అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెడుతోంది.

ఇక ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా అమరావతిపై గత కొంతకాలంగా ఉన్న అనిశ్చితి తొలగిపోనుంది. రాజధాని నగరం అభివృద్ధికి, కేంద్ర నిధుల కేటాయింపులకు ఈ చట్టబద్ధత ఎంతో కీలకం కానుంది. ఏపీ పునర్విభజన చట్టానికి జరుగుతున్న ఈ సవరణతో అమరావతి హోదాపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here