గుజరాత్ తరహాలోనే తెలంగాణకు నిధులివ్వండి – ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Urges PM Modi To Support Telangana Model Just Like Gujarat

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ఆదివారం జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి పలు కీలక విన్నపాలు చేశారు. సందర్భోచితంగా సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

రెండు గంటల సమయం కేటాయించండి

తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు మరియు పెండింగ్ ప్రాజెక్టులు కేంద్రం వద్ద ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు కేవలం రెండు గంటల సమయం కేటాయించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. “ముక్కుసూటిగా చెప్పాలంటే.. మీ ఆశీస్సులు మాకు కావాలి. మా ప్రాజెక్టుల గురించి వివరించేందుకు మీరు కొంత సమయం కేటాయిస్తే, రాష్ట్ర ప్రగతికి అది ఎంతగానో తోడ్పడుతుంది” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్

రాష్ట్రాల నుంచి వచ్చే అభివృద్ధి ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు లభించేలా ప్రధాని కార్యాలయంలో (PMO) ఒక ప్రత్యేక ‘సింగిల్ విండో’ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల ప్రాజెక్టుల మంజూరులో జాప్యం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కీలక ప్రాజెక్టులపై దృష్టి

రాష్ట్ర ప్రగతిలో మైలురాళ్లుగా నిలిచే పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సీఎం కోరారు.

  • మూసీ పునరుజ్జీవనం: మూసీ నదిని ప్రక్షాళన చేసి నగర రూపురేఖలు మార్చే ప్రాజెక్టుకు సహకరించాలి.

  • మెట్రో రైలు విస్తరణ: హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు తక్షణ అనుమతులు అవసరం.

  • మౌలిక సదుపాయాలు: రేడియల్ రోడ్లు మరియు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ప్రతిపాదించిన 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అండగా నిలవాలి.

గుజరాత్ మోడల్ తరహాలోనే..

గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు (మోదీకి) ఏ విధంగా సహకరించారో.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి కూడా మీరు అదే విధంగా సహకరించాలని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. “మీరు గుజరాత్ మోడల్‌ను ఎలా అభివృద్ధి చేశారో, నేను వచ్చే పదేళ్లలో ‘తెలంగాణ మోడల్’ను అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

కేంద్రం నిర్దేశించిన 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా (300 బిలియన్ డాలర్లు) అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ‘వికసిత్ భారత్’తో పాటు ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలు కలిసి సాగాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here