ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా.. నేటినుంచి మంత్రి లోకేశ్ రష్యా పర్యటన

Minister Nara Lokesh Heads to Russia for International Economic Summit

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అంతర్జాతీయ వేదికలపై చురుగ్గా కదులుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేటినుంచి రష్యా దేశంలో కీలక పర్యటన చేయనున్నారు. జూన్ 2 నుంచి జూన్ 7 వరకు ఐదు రోజుల పాటు సాగనున్న ఈ విదేశీ పర్యటనలో ఏపీకి నూతన పెట్టుబడులను, పారిశ్రామిక అవకాశాలను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు.

అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరంలో భాగస్వామ్యం

రష్యాలోని ప్రముఖ నగరమైన సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్’ సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేశ్‌కు అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థిక నిపుణులు, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను ప్రపంచ వేదికపై వివరించనున్నారు. ఏపీని ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాటో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడనుంది.

రష్యా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు

ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ రష్యాకు చెందిన పలువురు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు, ఉపాధి కల్పనకు అవసరమైన ఒప్పందాలపై ఈ సందర్భంగా ప్రాథమిక చర్చలు జరగనున్నాయి. రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి మరింత వేగవంతం కానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here