ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు (మంగళవారం) హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘తెలంగాణ నవ నిర్మాణ సభ’ పేరుతో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
అయితే, ఈ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడంతో, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ అత్యవసరంగా హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యున్నత ప్రాధాన్యతతో విచారించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికిప్పుడు ఈ అంశంపై విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ, కావలకుంటే వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.
పవన్ కల్యాణ్ సంచలన పోస్ట్.. సొంత ఇంట్లో ప్రెస్‌మీట్
తన నవ నిర్మాణ సభకు పోలీసులు పర్మిషన్ నిరాకరించడం, అటు కోర్టులోనూ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యవసర ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ మాదాపూర్‌లోని తన స్వగృహంలోనే పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశం (ప్రెస్‌మీట్) నిర్వహించాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది.
“ఈరోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని నా ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తాను. మా నాయకులతో కలిసి నా సొంత నివాసంలో నిర్వహించే ఈ ప్రెస్‌మీట్‌కైనా తెలంగాణ పోలీసు శాఖ అనుమతి ఇస్తుందా లేదా.. అనేది చూద్దాం” అంటూ పవన్ కల్యాణ్ పాలకులకు నేరుగా సవాల్ విసిరారు.
తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ కార్యకలాపాలను అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. సభల నిర్వహణకు ముందస్తు అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షల నడుమ జూబ్లీహిల్స్ వేదికగా పవన్ కల్యాణ్ చేయబోయే ప్రసంగం మరియు తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆయన గుప్పించబోయే విమర్శలు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.



































