ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాంతీయ విద్వేషాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో పర్యటించిన ఆయన.. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొంతమంది నేతలు కావాలనే విద్వేషాలు రేపుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించి, అక్కడ ప్రతిష్ఠించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులు, ప్రాంతీయత ఆధారంగా సాగుతున్న తాజా రాజకీయ వివాదాలపై ఆయన ముక్కుసూటిగా స్పందించారు.
మనసులకు ఫెన్సింగ్‌లు వేయలేరు
“తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవచ్చు. రాష్ట్రాల హద్దులకు ఫెన్సింగ్‌లు వేస్తారేమో కానీ, మనుషుల మనసులకు వేయలేరు కదా!” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరని, కానీ తెలుగువారి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఎప్పుడూ వేరే రాష్ట్రం వారు రాకూడదని చెప్పలేదని గుర్తుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య కాంట్రాక్టులు, వ్యాపారాలు సజావుగా సాగుతున్నప్పుడు, కేవలం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం దేనికని ప్రశ్నించారు.
హైదరాబాద్ నా ఇల్లు.. నా పార్టీ అక్కడే పుట్టింది
హైదరాబాద్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ.. “హైదరాబాద్ నా ఇల్లు, నా జనసేన పార్టీ అక్కడే ఆవిర్భవించింది. అక్కడికి వెళ్ళడానికి నాకు ఎవరి అనుమతీ అవసరం లేదు. తెలంగాణలో పుట్టిన భూమి పుత్రులు అక్కడ సభలు పెట్టుకుంటే తప్పేంటి?” అని నిలదీశారు. పుష్కర కాలం (12 ఏళ్లు) దాటిన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయ ద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి , కేటీఆర్ లపై వ్యాఖ్యలు
ఈ వివాదం చినికి చినికి గాలివాన అయిందే తప్ప దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని పవన్ అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో తనకు సోదర సమాన బంధం ఉందని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని చెప్పారు. అలాగే ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నేతలే పనిగట్టుకుని ఇలాంటి విద్వేషాలు రేపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోటీ చేయవచ్చు కానీ, తాము వస్తే బెదిరిస్తారా అని నిలదీశారు.
మహనీయుల త్యాగాలను గుర్తించాలి
రాహుల్ గాంధీ దేశమంతా తిరిగినా ప్రయోజనం ఏముందని ప్రశ్నిస్తూ.. బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి మహనీయుల త్యాగాలను కాంగ్రెస్ నేతలు గుర్తించాలని హితవు పలికారు. ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలకు శాశ్వతంగా ముగింపు పలకడమే తన తపన అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.





































