ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద, మధ్యతరగతి రోగులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI) సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 18 ప్రముఖ ప్రభుత్వ బోధనాసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులలో దేశంలోని టాప్ స్టార్టప్ సంస్థల భాగస్వామ్యంతో ఒక ప్రతిష్టాత్మక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. కేవలం 40 అత్యాధునిక డిజిటల్ పరికరాల సహాయంతో, అత్యంత తక్కువ సమయంలోనే దాదాపు 15 రకాల సంక్లిష్టమైన వ్యాధులను ప్రాథమిక దశలోనే నిర్ధారించేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.
వ్యాధి నిర్ధారణలో సరికొత్త ఆవిష్కరణలు
-
డిజిటల్ ప్రిస్క్రిప్షన్ విప్లవం: ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆసుపత్రికి వచ్చే రోగికి, అక్కడి డ్యూటీ డాక్టర్‌కు మధ్య జరిగే సాధారణ సంభాషణను ల్యాప్‌టాప్ లేదా చిన్న మైకుల ద్వారా ఏఐ సాఫ్ట్వేర్ రికార్డ్ చేస్తుంది. ఈ ఆడియో డేటాను విశ్లేషించి పేషెంట్ సమస్య ఏమిటి, ఏ మందులు వాడాలనే మెడికల్ సమ్మరీతో కూడిన డిజిటల్ ప్రిస్క్రిప్షన్‌ను ఈ టెక్నాలజీ క్షణాల్లో సిద్ధం చేసి ఇస్తుంది. దీనివల్ల వైద్యుల సమయం భారీగా ఆదా అవుతుంది.
-
15 రకాల పరీక్షలు – తక్షణ ఫలితాలు: సాధారణ రక్త నమూనాలు సేకరించకుండానే.. కేవలం కంటి ఫోటో ఆధారంగా రోగిలో రక్తహీనతను గుర్తించడం, రోగి దగ్గు శబ్దం ఆధారంగా క్షయ వ్యాధిని కనిపెట్టడం, గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో నరాల సంబంధిత లోపాలు, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఏఐ కెమెరాలను ఉపయోగించడం వంటి అద్భుత ప్రక్రియలు ఈ ఆసుపత్రుల్లో ప్రారంభమయ్యాయి. దీనివల్ల నివేదికల కోసం రోగులు రోజుల తరబడి వేచి చూసే ఇబ్బందులు తొలగిపోతాయి.
‘క్యాథ్’ కమిటీ వడబోత – నాలుగు విభాగాల్లో సేవలు
రాష్ట్ర ఆరోగ్యశాఖ ‘ఏపీ మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం ఐఐఎస్ బెంగళూరు నిపుణులు డాక్టర్ వి. రామనాథన్, ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ మోనా దుగ్గల్, ఏఐ నిపుణులు డాక్టర్ సుహేల కపూర్, ఏఐజీ హాస్పిటల్స్ నిపుణులు డాక్టర్ రాకేష్ కలపాల వంటి ప్రముఖులతో ప్రత్యేకంగా ‘క్యాథ్’ (Committee for Applied Technologies in Health – CATH) కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి వచ్చిన 297 దరఖాస్తులను పరిశీలించి అత్యుత్తమ 18 స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ సంస్థలను నాలుగు కీలక కేటగిరీలుగా విభజించి సేవలను విస్తరించారు:
-
డయాగ్నోస్టిక్ టూల్స్: శాలిసిట్ టెక్నాలజీస్, సన్ఫాక్స్, ఆర్ట్ పార్క్ వంటి సంస్థలు అనంతపురం, విశాఖ కేేంద్రాల్లో గత డేటా ఆధారంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తిని ముందే అంచనా వేస్తున్నాయి.
-
పోర్టబుల్ పాయింట్ ఆఫ్ కేర్: పెరివింకిల్, రెమిడియో, హువెల్ లైఫ్ సైన్సెస్ వంటి సంస్థలు ల్యాబొరేటరీలతో పనిలేకుండా కేవలం ఒక చిన్న ‘సూట్‌కేస్ సైజ్ కిట్’ ద్వారా గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లలో గర్భాశయ క్యాన్సర్, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ పరీక్షలను స్పాట్లోనే పూర్తి చేస్తున్నాయి.
-
స్మార్ట్ మానిటరింగ్ & వేరబుల్స్: కేర్ ఎన్ఎక్స్, స్టార్టూన్ ల్యాబ్స్ వంటి సంస్థలు శరీరానికి అమర్చే చిన్న పరికరాల ద్వారా సత్తెనపల్లి, తెనాలి, కాకినాడ, విక్టోరియా ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు అవసరమైన ఆక్సిజన్ పర్యవేక్షణ, కీళ్లనొప్పుల మూలాలను గుర్తిస్తున్నాయి.
-
రిమోట్ కేర్ టెలిమెడిసిన్: మోనేరి ఏఐ, డీప్ ఫ్యాక్ట్స్ వంటి సంస్థలు పాడేరు, కర్నూలు, తిరుపతి రుయా ఆసుపత్రుల ఐసీయూ బెడ్స్‌పై ఉన్న రోగుల బీపీ, పల్స్, ఉష్ణోగ్రతలను వైర్లెస్ పరికరాల ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కాకినాడ, విజయవాడ, పార్వతీపురం, తెనాలి వంటి 18 ప్రధాన కేంద్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. ప్రసిద్ధ ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ సాంకేతిక సహకారంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణను ప్రత్యేకంగా చూస్తున్నారు.
స్టార్టప్ కంపెనీల ట్రయల్స్ పూర్తి కాగానే పూర్తి నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సమర్పిస్తామని, సీఎం ఆదేశాల మేరకు ఈ ఏఐ సేవలను రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు శాశ్వతంగా విస్తరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.





































