మెగా డీఎస్సీ ఎంపికలో ఒక్క ఉల్లంఘన కూడా లేదు, అయినా రోజుకో కుట్ర – సీఎం చంద్రబాబు

CM Chandrababu Says, Mega DSC Selection Based on Merit and Transparency

మెగా డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. డీఎస్సీపై ప్రతి అంశానికి ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ రోజుకో కొత్త ఆరోపణ, కుట్రతో నియామక ప్రక్రియను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు స్వయంగా రోడ్డెక్కి తమ ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెబుతున్నారని, అదే ప్రతిపక్షానికి సరైన సమాధానమని అన్నారు.

సోమవారం శాసనసభలో మెగా డీఎస్సీ అంశంపై మాట్లాడిన సీఎం.. నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేదని స్పష్టం చేశారు. మెరిట్‌ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని, ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో నిర్వహించామని తెలిపారు.

148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. మొత్తం 15,941 టీచర్‌ పోస్టులను భర్తీ చేశామని, కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు.

వర్టికల్‌, హారిజంటల్‌ రిజర్వేషన్లను నిబంధనల ప్రకారం అమలు చేశామని చెప్పారు. క్రీడా కోటా పోస్టుల భర్తీలోనూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించామని వివరించారు.

ఎంపికైన అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారని, ఎంపిక ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరగడంతో పారదర్శకతకు ఎలాంటి లోటు లేదని సీఎం పేర్కొన్నారు.

ఉద్యోగాలు సాధించిన వారికి అండగా ఉంటాం

డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహిస్తూ తమకు జరిగిన ఎంపికపై విశ్వాసం వ్యక్తం చేయడం మంచి పరిణామమని చంద్రబాబు అన్నారు. ఉద్యోగాలు పొందినవారు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నియామక ప్రక్రియపై వందలాది కేసులు వేసి డీఎస్సీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసిందని స్పష్టం చేశారు.

అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి

ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలు బాధ్యతగా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చంద్రబాబు సూచించారు. రెండున్నరేళ్లుగా అసెంబ్లీకి రాని పార్టీని తన రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు.

ప్రజలపై బాధ్యత ఉంటే శాసనసభకు వచ్చి తమ అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని అన్నారు. ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం వాటిని నిలదీస్తామని స్పష్టం చేశారు.

గత ఐదేళ్లలో ఒక్క టీచర్‌ నియామకం కూడా లేదు

గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో ఒక్క టీచర్‌ నియామకం కూడా చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నిర్వహించిన 14 డీఎస్సీల్లో 11 తన ముఖ్యమంత్రి హయాంలోనే జరిగాయని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 80 శాతం మంది తన హయాంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారానే ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ఇంతవరకు ఆ నియామకాల్లో అవినీతి జరిగిందని ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై వ్యాఖ్యలు

వైసీపీ పాలనలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ‘తల్లికి వందనం’ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

ఈ చర్యలతో సుమారు లక్ష మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని సీఎం తెలిపారు.

గ్రూప్‌-1 అక్రమాలపై తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 నియామక పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలపై కూడా చంద్రబాబు స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్‌-1 తరహా స్కామ్‌ను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

ఆ వ్యవహారంలో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 అంశంపై శాసనసభ సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.

మహిళా టీచర్లకు డీఎస్సీతో ప్రత్యేక అనుబంధం

మెగా డీఎస్సీలో మహిళా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పొందారని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా టీచర్లు మాట్లాడిన తీరును ప్రస్తావించారు.

తమ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మహిళా ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసంతో స్పందించారని తెలిపారు. వారి మాటల్లో నిజాయితీ, కష్టం స్పష్టంగా కనిపించాయని సీఎం అన్నారు.

మెగా డీఎస్సీ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here