కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో త్వరలో మరో దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభం కానుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ‘జంతర్‌మంతర్ సీజన్-2’ అతిత్వరలో ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. అయితే ఈసారి ఏ అంశంపై ఉద్యమం చేపట్టనున్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఢిల్లీలో బుధవారం నిర్వహించాల్సిన సీజేపీ వలంటీర్ల సమావేశం చివరి నిమిషంలో రద్దయిన అనంతరం దీప్కే మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పలువురు ‘జంతర్‌మంతర్ సీజన్-2 ఎప్పుడు?’ అని ప్రశ్నిస్తున్నారని.. వారికి త్వరలోనే సమాధానం ఇస్తామని చెప్పారు.
బీజేపీపై దీప్కే ఆరోపణలు
వలంటీర్ల సమావేశానికి హాల్ లభించకుండా బీజేపీ అడ్డంకులు సృష్టించిందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఢిల్లీలో సమావేశం నిర్వహించేందుకు అనేక ప్రాంతాల్లో హాల్ కోసం ప్రయత్నించామని, అయితే కొందరు యజమానులు తమపై ‘పై నుంచి ఒత్తిడి’ ఉందని చెప్పి హాల్ ఇచ్చేందుకు నిరాకరించారని పేర్కొన్నారు.
చివరకు ఒక హాల్‌ను బుక్ చేసుకున్నప్పటికీ.. దాని యజమానిని కూడా బీజేపీ బెదిరించిందని ఆయన ఆరోపించారు. సీజేపీ సమావేశానికి హాల్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు దీప్కే పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో దేశ యువత అంటే బీజేపీ భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. తమ ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్త కార్యక్రమం
సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్ మాట్లాడుతూ.. తదుపరి ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ప్రజల సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి.. తదుపరి ఉద్యమానికి సంబంధించిన అంశాలు, కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఉద్యమమా?
ఇటీవల అభిజీత్ దీప్కే సోషల్ మీడియా పోస్టుల్లో పాఠశాల విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, కొత్త పాఠశాలల నిర్మాణం, ప్రభుత్వ బడుల బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలో జంతర్‌మంతర్ సీజన్-2 ఉద్యమం కూడా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా రంగ సమస్యలపై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ప్రశ్నించగా.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంపై దేశవ్యాప్త క్యాంపెయిన్ చేపట్టే అవకాశం ఉందని దీప్కే సంకేతాలు ఇచ్చారు.
అయితే తుది ఉద్యమ అంశం, పూర్తి కార్యాచరణపై త్వరలో స్పష్టత వస్తుందని సీజేపీ వర్గాలు చెబుతున్నాయి.







































