ఎవరెవరు పనిచేయడం లేదో నా దగ్గర రిపోర్ట్ ఉంది – ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్

CM Revanth Reddy Issues Stern Warning to Congress MLAs Ahead of SIR Exercise

తెలంగాణలో రేపటినుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ‘సర్’ (Special Summary Revision – SSR) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అర్హులైన ఓట్ల పరిరక్షణ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యవసర జూమ్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు ప్రక్రియలో క్షేత్రస్థాయి పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న పలువురు శాసనసభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై శ్రేణులకు కఠిన దిశానిర్దేశం చేస్తూ, ఎవరెవరు పనిచేయడం లేదో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, తీరు మారకుంటే కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ కీలక సమావేశంలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వారం రోజుల్లో తీరు మారకుంటే ఇన్‌ఛార్జ్‌ల మార్పు.. సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక

నియోజకవర్గాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న నేతల తీరుపై ముఖ్యమంత్రి అత్యంత కఠిన వైఖరిని ప్రదర్శించారు. వారం రోజుల్లోగా ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోకపోతే, సదరు నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండే ప్రత్యామ్నాయ మరో వ్యక్తిని ఇన్‌ఛార్జిగా నియమిస్తామని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. ప్రతిపక్ష బీజేపీ ఈ ప్రక్రియ ద్వారా లౌకికవాద ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, ఇప్పుడే అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఎవరెవరు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదో నివేదికల రూపంలో పూర్తి సమాచారం తన వద్ద ఉందని, పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సమావేశంలో బహిరంగంగా అందరి పేర్లు చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు కూడా దీనిపై పూర్తి బాధ్యత తీసుకోవాలని, విఫలమైతే వారిని సైతం మార్చడానికి వెనుకాడబోమని సీఎం కరాఖండిగా తేల్చిచెప్పారు.

నాలుగు కీలక నియోజకవర్గాలపై పీసీసీ చీఫ్ ఫోకస్.. లౌకికవాదుల ఓట్ల తొలగింపు కుట్ర

ఈ ఉన్నత స్థాయి జూమ్ సమావేశంలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటర్ల సవరణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మెజారిటీ ఎమ్మెల్యేల వైఖరిని తప్పుపట్టారు. ముఖ్యంగా గద్వాల, మల్కాజిగిరి, భువనగిరి మరియు నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో పార్టీ పరంగా తాము ఓటర్ల సవరణ ప్రక్రియలో వెనుకబడి ఉన్నామని నివేదికల ద్వారా వెల్లడించారు.

లౌకికవాద భావజాలం ఉన్న ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నందున, ప్రతి ఒక్క ఓటునూ కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత శాసనసభ్యులపై ఉందన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు.

మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో, ఓటు హక్కు కూడా అంతే: మీనాక్షి నటరాజన్

అనంతరం ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది కేవలం రాజకీయాల కోసం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో అది ప్రతి పౌరుడి అత్యున్నత సామాజిక హోదా అని అభివర్ణించారు. సమాజంలో మనిషి మనుగడకు ఆక్సిజన్ ఎంత అవసరమో, ఓటు హక్కు అంత కీలకమని చెప్పారు. ఎంతో పోరాటం చేస్తేనే సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఓటు హక్కు సిద్ధించిందని, దానిని రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధులు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here