అమరావతి వర్సెస్ మావిగన్.. 2029 ఎన్నికల్లో మా నినాదం ఇదే – మాజీ సీఎం వైఎస్ జగన్

YSRCP Chief YS Jagan Sets Mavigan vs Amaravati Agenda For 2029 Elections

‘2029లో మావిగన్ అజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతాం. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. మావిగన్‌ను సమర్థించేవారంతా వైసీపీకి ఓటేస్తారు. అమరావతిని బలపరిచేవారంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. చూద్దాం ఏమవుతుందో? మా నిర్ణయంలో మార్పేమీ లేదు’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బుధవారం మీడియా ప్రతినిధులతో జగన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా నడవడం లేదని, రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ నడుస్తోందని అన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యం నడుస్తోందని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ‘హేరామ్‌ సేవ్‌ ఏపీ’ అంటూ కొత్త స్లోగన్‌ వినిపించారు.

రైతుల కోరిక మేరకు ఉండవల్లిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, నాయకులపై పోలీసుల సమక్షంలోనే చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో రాళ్లదాడి చేశారని జగన్ ఆరోపించారు. బాధితులైన వైసీపీ నేతలపైనే తిరిగి కేసులు పెట్టారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే తమ పార్టీ నేతలపై సీఎం చంద్రబాబు దాడికి ఉసిగొల్పారని విమర్శించారు.

రిటైర్డ్‌ జడ్జీలను, న్యాయవాదులను, మేధావులను పరిశీలనకు పంపుతానని, ఆ తర్వాతే తాను అమరావతిలో పర్యటించడంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అయితే, ఈ క్రమంలో గతంలో పరిపాలనా రాజధానిగా పేర్కొన్న విశాఖ సంగతేంటని ఓ జర్నలిస్టు అడగగా… ఆయన స్పందించలేదు.

సాయికృష్ణను పోలీసులు లాక్‌పడెత్‌ చేశారని, పోలీసుల వేధింపుల వల్ల క్రాంతికుమార్‌ వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ అన్నారు. తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం సంతకవిటీ కళావతి కేసులు రాష్ట్రంలో దిగజారిపోయిన చట్టం, పోలీసు వ్యవస్థకు అద్దం పడుతున్నాయన్నారు. కృష్ణలంక సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. కృష్ణలంక సీఐని ప్రభుత్వ పెద్దలు చంపేస్తారంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.

బిహార్‌ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా జంగిల్‌రాజ్‌ అని అనుకునేవారమని, వాస్తవానికి రాష్ట్రంలోనే ఆటవిక రాజ్యం నడుస్తోందని అన్నారు. కులాలు, మతాల మధ్య సీఎం చంద్రబాబు విద్వేషాలు రగిలిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను తాను ఆధారాలతో సహా నిరూపించానన్న జగన్‌.. మంత్రి లోకేశ్‌ వాటిని తప్పని నిరూపించగలరా అని ప్రశ్నించారు.

ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రాజధాని అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, కొత్త నినాదాలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here