ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగర కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక మైలురాయి చేరనుంది. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన రెండవ ప్రధాన కార్యాలయాన్ని (సెకండ్ హెడ్‌క్వార్టర్స్) భాగ్యనగరంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) బోధి పెవిలియన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి, జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ ప్రధాన చిరునామాగా మారిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తు సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, చందన్వెల్లిలో ఎయిర్టెల్ నెలకొల్పనున్న డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కోరారు. దాంతో పాటు తెలంగాణలో మరింత భారీ సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సునీల్ భారతీ మిట్టల్‌కు సూచించారు.
హైదరాబాద్‌లో ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాల విస్తరణను ముమ్మరం చేయాలన్నారు. భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యల వేగవంతమైన పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేయాలని ప్రతిపాదించారు.
ఈ చర్చల పట్ల సునీల్ మిట్టల్ సానుకూలంగా స్పందిస్తూ, హైదరాబాద్‌ను ఎయిర్టెల్ రెండో పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఫైబర్ కనెక్టివిటీని మరింత విస్తృతం చేయడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
అలాగే, విద్యా రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటును సీఎం వివరించగా, సామాజిక బాధ్యతలో భాగంగా భారతీ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లలో చదువుకునే పేద విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు అందజేస్తామని సునీల్ మిట్టల్ వెల్లడించారు.








































