20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. మిడ్జిల్‌ కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

CM Revanth Reddy Gets Emotional While Recalling His 20 Years Political Journey in Thanksgiving Meeting at Midjil

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధిగా నేటితో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభ భావోద్వేగ క్షణాలకు వేదికగా మారింది. తన రాజకీయ జీవితానికి పునాది పడిన గడ్డపైనే ఈ మైలురాయిని జరుపుకోవడం జీవితంలో మరపురాని అనుభూతి అని సీఎం పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం మిడ్జిల్ జెడ్పీటీసీగా ప్రజల ఆశీర్వాదంతో ప్రారంభమైన తన ప్రయాణం, నేడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం వెనుక ప్రజల విశ్వాసమే అతిపెద్ద బలమని అన్నారు.

మిడ్జిల్ ప్రజల ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది

మిడ్జిల్ ప్రజల ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2005లో ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన తన రాజకీయ జీవితం ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు, రాజకీయ సంఘర్షణలను చూసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో తోడుగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, అలాగే తనను నమ్మి ఆశీర్వదించిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

‘రేవంత్ రెడ్డి నుంచి రేవంతన్నగా…’

మిడ్జిల్‌లో ప్రారంభమైన తన ప్రయాణం, నేడు రాష్ట్ర ప్రజల గుండెల్లో ‘రేవంతన్న’గా గుర్తింపు తెచ్చిపెట్టిందని సీఎం భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం లక్షల అక్షరాలతో రాసినా, కోట్ల పదాలతో వివరించినా పూర్తిగా చెప్పలేని ఓ అపూర్వ అనుభవమని అన్నారు. అయితే ప్రతి క్లిష్ట పరిస్థితిలోనూ ప్రజలు తనకు అండగా నిలవడంతోనే ముందుకు సాగగలిగానని చెప్పారు. ప్రజల ప్రేమ, నమ్మకం, ఆశీర్వాదం తనకు ఎప్పటికీ తీరని ఋణమని పేర్కొన్నారు.

‘తెలంగాణ పునర్నిర్మాణమే నా లక్ష్యం’

రాబోయే రోజుల్లో కూడా ఇదే నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి అడుగు ప్రజల అభివృద్ధికే అంకితం చేస్తానని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

‘అధికారం కాదు.. ప్రజల విశ్వాసమే ముఖ్యం’

అధికారం శాశ్వతం కాదని, కానీ ప్రజల ప్రేమ, విశ్వాసం శాశ్వతమని సీఎం అన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ ప్రజల కోసం పనిచేసే అవకాశం లభించడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడటమే తన రాజకీయ తత్వమని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నిజమైన ప్రజాసేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు

మిడ్జిల్‌లో నిర్వహించిన ఈ కృతజ్ఞత సభకు కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు ప్రదర్శించగా, సభ ప్రాంగణం నినాదాలతో మార్మోగింది. తన రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసిన మిడ్జిల్ ప్రజలకు మరోసారి సీఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఆశీర్వాదంతోనే మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here