నిరంజన్ లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Dy CM Pawan Kalyan Mourns His Fan Niranjan's Demise, Says My Heart is Broken

హనుమకొండకు చెందిన తన వీరాభిమాని హనుమకొండ నిరంజన్ మరణ వార్తపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన అత్యంత భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రాణాంతకమైన డ్యూచెస్‌ మస్కులర్‌ డిస్ట్రోఫీ (DMD) వ్యాధితో పోరాడుతూ ఆ బాలుడు హైదరాబాద్ ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

గత నెలలోనే హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి, మంచానికే పరిమితమైన ఆ బాలుడిని పరామర్శించిన క్షణాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నిరంజన్‌కు ఉన్న అచంచలమైన విశ్వాసం, అంతటి కష్టంలోనూ అతని ముఖంలో కనిపించిన చిరునవ్వు తనను ఎంతగానో కదిలించాయని అన్నారు. ఆ దుర్గామాత ఆశీస్సులతో బాలుడు త్వరగా కోలుకోవాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షించానని, కానీ ఇంతలోనే కాలం అతడిని మనకు కాకుండా చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరంజన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తమ కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో జనసేన శ్రేణులు, మెగా అభిమానులు నిరంజన్ మృతికి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నివాళులర్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here