ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి ‘పరఖ్‌’ విధానంలో పదో తరగతి పరీక్షలు

AP SSC Board Introduces NCERT's PARAKH Framework in 10th Exams From 2026-27 Academic Year

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల ప్రశ్నావళి శైలి (ప్రశ్నపత్రాల రూపకల్పన) పూర్తిగా మారనుంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఇప్పటివరకూ అనుసరిస్తున్న సంప్రదాయ ‘బ్లూమ్స్ టాక్సానమీ’ (వర్గీకరణ) విధానానికి స్వస్తి పలికి, 2026-27 విద్యా సంవత్సరం నుంచి సరికొత్తగా ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పరిధిలోని ‘పరఖ్’ (PARAKH) వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన ఎస్‌ఎస్‌సీ (SSC) బోర్డు నూతన బ్లూప్రింట్లను అధికారికంగా విడుదల చేస్తూ, విద్యార్థులు ఈ నూతన మార్పులపై అవగాహన పెంచుకోవాలని సూచించింది.

సృజనాత్మకతకు పెద్దపీట.. మారిన మార్కుల వెయిటేజీ

ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానంలో విద్యార్థుల విజ్ఞానం, అవగాహన, అన్వయం, సృజనాత్మకత, మరియు మూల్యాంకనం ఆధారంగా ప్రశ్నపత్రాలు ఉండేవి. దీనివల్ల పుస్తకాల్లో ఉన్న సమాచారాన్ని యథావిధిగా బట్టీ పట్టి రాస్తేనే ఎక్కువ మార్కులు వచ్చే పరిస్థితి ఉండేది. అయితే, ఇకపై అలా కాకుండా విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు, వాటిని సొంత అభిప్రాయాలతో ఎలా జోడించి రాయగలరు అనే అంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇందుకోసం ప్రశ్నావళిని మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు:

  • అవగాహన విభాగం (60% ప్రశ్నలు): ఇందులో విద్యార్థి సబ్జెక్టుపై సాధించిన విజ్ఞానం, సదరు పాఠ్యాంశాన్ని అమలు చేసే విధానం, కాన్సెప్ట్‌ను అర్థం చేసుకున్న తీరును పరీక్షిస్తారు. (ఇంగ్లిష్ సబ్జెక్టులో మాత్రం దీనికి 65 శాతం వెయిటేజీ ఉంటుంది).

  • సున్నితత్వం విభాగం (20% ప్రశ్నలు): భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ వ్యక్తీకరించడం, సానుకూల దృక్పథంతో విభిన్న సామాజిక అంశాలను అర్థం చేసుకోవడం మరియు టీమ్ వర్క్ (సమష్టి నైపుణ్యం) ప్రతిబింబించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. (ఇంగ్లిష్‌లో దీనికి 15 శాతం వెయిటేజీ).

  • సృజనాత్మకత విభాగం (20% ప్రశ్నలు): సంపాదించిన విజ్ఞానాన్ని నైపుణ్య రూపంలోకి మార్చి ఎలా అన్వయించాలి, భాషా స్పష్టత, నూతన ఆలోచనలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను అంచనా వేసేలా ప్రశ్నలు వస్తాయి.

మొత్తం ప్రశ్నపత్రంలో సులభతర ప్రశ్నలు 25 నుండి 30 శాతం, మోస్తరు (ఆవరేజ్) ప్రశ్నలు 50 శాతం, మరియు క్లిష్టమైన (కఠినమైన) ప్రశ్నలు 20 శాతం మేర ఇవ్వనున్నారు.

సొంతంగా ఆలోచించి రాసేలా ‘ఓపెన్ మైండెడ్’ ప్రశ్నలు

నూతన ‘పరఖ్’ విధానంలో సున్నితత్వం, సృజనాత్మకత విభాగాలలో ఎక్కువగా ‘ఓపెన్ మైండెడ్’ ప్రశ్నలకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే సదరు ప్రశ్న పాఠ్యాంశం ఆధారంగానే వచ్చినప్పటికీ.. దానికి ఒకే రకమైన సమాధానం కాకుండా, విద్యార్థి తన సొంత ఆలోచనా శైలికి తగ్గట్టుగా నచ్చిన రీతిలో జవాబు రాసుకునే స్వేచ్ఛ ఉంటుంది.

ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసిన మోడల్ బ్లూప్రింట్ ఆధారంగా సబ్జెక్టుల వారీగా రాబోయే నూతన ప్రశ్నల సరళి ఈ క్రింది విధంగా ఉండనుంది:

  • సోషల్ స్టడీస్ (సాఘిక శాస్త్రం): సమాజంలో లింగ అసమానతలపై అవగాహన కోసం ‘ఇంటి పనులు లింగ అసమానతను ఎలా చూపిస్తాయో రెండు ఉదాహరణలతో నిరూపించండి’ అనే ప్రశ్నతో పాటు, సామాజిక బాధ్యతను పెంచేందుకు ‘మీరు ఒక జర్నలిస్ట్ అయితే.. సుస్థిరాభివృద్ధి ప్రాముఖ్యతపై వ్యాసం రాయడానికి ఏయే ముఖ్యాంశాలను చేరుస్తారు?’ వంటి ఆలోచనాత్మక ప్రశ్నలు ఉంటాయి.

  • బయాలజీ (జీవశాస్త్రం): ఆరోగ్య స్పృహపై ‘రవి, రాజు స్నేహితులు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. రవి తనకు ధూమపానం ఉపశమనం కల్పిస్తుందని భావిస్తుండగా, యోగా చేయడం మంచిదని రాజు అన్నారు. వీరిలో ఎవరు తప్పుగా ఆలోచిస్తున్నారు? అతను వాస్తవాన్ని తెలుసుకునేలా నువ్వు ఎలాంటి అవగాహన కల్పిస్తావు?’ అనే నిత్యజీవిత ఆధారిత ప్రశ్నలు ఇస్తారు.

  • ఇంగ్లిష్ సబ్జెక్టు: భాషా నైపుణ్యాలను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఏదైనా ఒక సభకు సంబంధించిన ప్రసంగానికి స్క్రిప్టు రూపొందించడం, అలాగే అధికారిక (ఫార్మల్) మరియు అనధికారిక (ఇన్ఫార్మల్) లేఖలు రాయడం వంటి ప్రాక్టికల్ ప్రశ్నలు నూతన బ్లూప్రింట్‌లో చోటు సంపాదించుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here