ముంబైలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎం, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్‌కు ధైర్యం చెప్పి, వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ముంబైలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు పరామర్శించాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.@PawanKalyan pic.twitter.com/Kn5TuwsFL8
— N Chandrababu Naidu (@ncbn) July 12, 2026
ఇటీవల భుజానికి సంబంధించిన సమస్యల కారణంగా పవన్ కళ్యాణ్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్న చంద్రబాబు, చికిత్స అందిస్తున్న వైద్య బృందంతో కూడా మాట్లాడినట్లు సమాచారం.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “ముంబైలో చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించాను. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. పవన్ ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు ఆదివారం సాయంత్రం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దీవాలా నేతృత్వంలోని వైద్య బృందం శనివారం ఉదయం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు అనుకూలంగా స్పందిస్తూ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఫిజియోథెరపీ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పునరావాస చికిత్స (రీహాబిలిటేషన్) పూర్తి అయిన అనంతరం సుమారు నాలుగు నెలల్లో భుజం పనితీరు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ఇక ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, జనసేన మరియు టీడీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఆయన త్వరగా కోలుకుని ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటున్నారు.






































