హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించండి – ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Telangana HC Directs CS For Immediate Removal of AV Ranganath as HYDRAA Commissioner

హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం, చట్టాన్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులు న్యాయస్థానాల ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.

లోతుకుంట భూ వివాదంతో కోర్టు ఆగ్రహం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా అధికారులు ఉల్లంఘించారనే ఆరోపణలపై విచారణ జరిగింది. సదరు భూమిలోకి ప్రవేశించవద్దని కోర్టు ముందుగానే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్‌ను తొలగించి కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.

క్షమాపణ సరిపోదన్న హైకోర్టు

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ సమర్పించగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ అఫిడవిట్ ద్వారా బేషరతుగా క్షమాపణలు తెలిపారు. న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు. అయితే, ఆయనపై ఇప్పటికే అనేక కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉండటంతో కేవలం క్షమాపణతో విషయం ముగిసే పరిస్థితి లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతి పౌరుడికి న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులే వాటిని ఉల్లంఘిస్తే అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని స్పష్టం చేసింది.

కొత్త కమిషనర్ నియామకానికి ఆదేశాలు

ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో అర్హత కలిగిన ఐజీ స్థాయి అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు హైడ్రా వ్యవస్థ పనితీరుపై, ప్రభుత్వ యంత్రాంగం న్యాయస్థానాల ఆదేశాల అమలుపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here