చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు

AP Govt Dissolves 19 University Governing Bodies and Removes Nominated Members

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల నిర్వహణ, పాలనను మరింత వేగవంతం చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 విశ్వవిద్యాలయాల పాలక మండలి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) నామినేటెడ్ సభ్యులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్లాజ్-2 కింద నియమితులైన సభ్యులందరినీ ఈ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయం కేవలం నామినేటెడ్ ప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. క్లాజ్-1 పరిధిలోకి వచ్చే పదవీ రీత్యా కొనసాగే ‘ఎక్స్-ఆఫిషియో’ సభ్యుల బాధ్యతల్లో ఎలాంటి మార్పులు ఉండవని, వారు తమ సేవలలో యథావిధిగా కొనసాగుతారని పేర్కొంది. విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను సమగ్రంగా పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

పాలనా సంస్కరణల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి (ఏయూ) ప్రభుత్వం ఇప్పటికే కొత్త పాలక మండలిని నియమించింది. మిగిలిన 18 విశ్వవిద్యాలయాలకు కూడా త్వరలోనే నూతన పాలక మండళ్ల నియామకం పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ఉన్నత విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు బోధన, పరిశోధనల ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. నూతన పాలక మండళ్ల ఏర్పాటు ద్వారా విశ్వవిద్యాలయాల నిర్వహణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here