ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరిన ఆయన వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది స్వగ్రామానికి చేరుకున్నారు. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి అమర్‌హే.. జోహార్ పెద్ది సుదర్శన్‌రెడ్డి’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు.
పెద్ది కుటుంబానికి పరామర్శ, భరోసా
పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న కేసీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ది భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధర్మిష్ట, తల్లి అమృతమ్మను పరామర్శించి ఓదార్చారు. పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు కేసీఆర్ భరోసా కల్పించారు. సుదర్శన్‌రెడ్డి భౌతికంగా తమ మధ్య లేకపోయినా కుటుంబం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తాను పెద్దదిక్కుగా ఉంటానని తెలిపారు. పార్టీ కూడా ఎల్లవేళలా కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పిల్లలను ఉన్నతంగా చదివించి, తండ్రి లేని లోటు తెలియకుండా చూసుకోవాలని పెద్ది సోదరులకు సూచించారు.
భారీ ఆర్థిక సాయం
ముందుగా ప్రకటించిన విధంగానే పెద్ది కుటుంబానికి కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే ఆయన తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చెక్కును అందించారు. దీంతో పెద్ది కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లైంది.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా ఉద్యమాల్లో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోషించిన కీలక పాత్రను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని, ప్రేమానురాగాలను స్మరించుకున్నారు.
కేసీఆర్ వెంట వచ్చిన బీఆర్ఎస్ కీలక నేతలు
కేసీఆర్ వెంట బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జోగినపల్లి సంతోష్‌కుమార్, బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నల్లబెల్లికి తరలివచ్చారు.







































