తెలంగాణలో నకిలీ రేషన్ కార్డులకు చెక్ పెట్టిన రేవంత్ సర్కార్

Telangana Govt To Launch New Smart Ration Cards With 9 Advanced Security Features

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే ఆహార భద్రత కార్డులను మరింత ఆధునికంగా, సురక్షితంగా తీర్చిదిద్దింది. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నుంచి పంపిణీ చేయనున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డులను (ఆహార భద్రత కార్డులు) అత్యున్నత భద్రతా ప్రమాణాలతో రూపొందించారు. నకిలీ కార్డుల సృష్టిని, అక్రమాలను అరికట్టేందుకు వీలుగా బ్యాంకు నోట్లు, కరెన్సీ, పాస్‌పోర్టుల తయారీలో వాడే 9 రకాల ఆధునిక సెక్యూరిటీ టెక్నాలజీలను ఈ కార్డుల్లో పొందుపరిచారు.

ఈ నూతన స్మార్ట్ కార్డుల రూపకల్పనలో మహిళా ప్రాధాన్యతకు పెద్దపీట వేశారు. కుటుంబ యజమానిగా మహిళ పేరునే కార్డుపై ప్రముఖంగా ముద్రించారు. అంతేకాకుండా, కార్డుపై పైభాగంలో ఎడమవైపు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలను ముద్రించారు. కార్డుపై రేషన్ కార్డు నంబర్, కుటుంబ యజమాని పేరు, చౌకధరల డిపో సంఖ్య, గ్రామం, మండలం, జిల్లా మరియు ఇంటి చిరునామా వంటి సమగ్ర వివరాలు ఉంటాయి.

ఈ కార్డుల్లో హోలోగ్రామ్ నుంచి ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ (Encrypted QR) కోడ్ వరకు అత్యంత సాంకేతికమైన భద్రతా అంశాలు ఉన్నాయి. పౌరసరఫరాల అధికారులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే లబ్ధిదారుల సమాచారం, వివరాలు తక్షణమే నిర్ధారణ అవుతాయి. అత్యంత పారదర్శకంగా, నకిలీలకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో రేషన్ సరుకులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here