ఎల్‌నినో కరోనా లాంటి విపత్తు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి – సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy Warns of El Niño Impact, Urges Farmers To Postpone One Crop Season

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంత్రులతో రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించిందని గుర్తుచేశారు. ఈ పరిస్థితులు మనుషులు, జంతువులు సహా అన్ని జీవరాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వచ్చే యాసంగి సీజన్‌లో వరి సాగును వాయిదా వేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నీటి లభ్యతను అంచనా వేసుకోకుండా పంటలు వేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధి హామీ పనుల ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువులు, కుంటలను వర్షాకాలానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎండల తీవ్రతతో విద్యుత్, నీటి వినియోగం పెరుగుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన విద్యుత్ కొనుగోలుకు కేంద్రం సహకరించాలని కోరనున్నట్లు వెల్లడించారు. సాగునీరు, తాగునీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దసరా తర్వాత అఖిలపక్షంతో చర్చలు జరిపి, అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి సహాయం కోరుతామని చెప్పారు. సుమారు రూ.20వేల నుండి రూ.30వేల కోట్ల వరకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుదామని అధికారులకు ఆయన సూచించారు.

ఎల్‌నినోపై ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం అందించేందుకు మాజీ సీఎస్ కె. రామకృష్ణారావును నోడల్ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. ప్రకృతి విపత్తును రాజకీయాలకు అతీతంగా సమష్టిగా ఎదుర్కోవాలని అన్ని పార్టీలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here