హైటెక్స్‌లో ‘సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్’.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Launches Samakhya Chamber of Commerce Summit at Hitex, Hyderabad

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్య సాధనలో రాష్ట్రాల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బుధవారం ప్రారంభమైన సమాఖ్య బిజినెస్ సమ్మిట్‌-2026లో పాల్గొని మాట్లాడిన ఆయన, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధి సాధనలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్ డాక్యుమెంట్‌తో ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు. రాష్ట్ర సమతుల్య ఆర్థిక వృద్ధి కోసం అభివృద్ధి ప్రణాళికను మూడు వినూత్న భాగాలుగా వర్గీకరించినట్లు వెల్లడించారు.

  • క్యూర్ (CURE – Core Urban Region Economy): ORR లోపల ఐటీ, సేవలు మరియు ఆవిష్కరణల రంగాలు.

  • ప్యూర్ (PURE – Peri Urban Region Economy): ORR నుండి RRR మధ్య తయారీ, లాజిస్టిక్స్ మరియు పారిశ్రామిక పార్కులు.

  • రేర్ (RARE – Rural Agriculture Region Economy): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఉపాధి కల్పన.

దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 శాతం నుండి 10 శాతానికి పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, “మీ పెట్టుబడులకు మాది భరోసా” అని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, ఆర్టీసీ, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో వారికి వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here