క్యూర్‌ పరిధిలో.. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ కేటాయింపునకు ముహూర్తం ఖరారు

Telangana Govt to Release Indiramma Housing Towers Eligible Beneficiaries List on August 25

హైదరాబాద్‌ పరిధిలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (CURE)లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ కేటాయింపుల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

7,340 ఇళ్లకు 60,720 దరఖాస్తులు

CURE పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. మొత్తం 60,720 దరఖాస్తులు హౌసింగ్‌ బోర్డుకు అందాయి. వీటిలో 40 వేలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

అర్హత సాధించిన దరఖాస్తుదారుల వివరాలను తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ నంబర్‌ లేదా ఫోన్‌ నంబర్‌ ఆధారంగా స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.

అభ్యంతరాల నమోదుకు అవకాశం

అర్హుల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తుదారులు ఆగస్టు 23 సాయంత్రంలోగా వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు లేదా అభ్యంతరాన్ని నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం లాటరీకి అర్హత సాధించిన వారి తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నారు.

ఆగస్టు 27 నుంచి లక్కీ డ్రా

తుది జాబితా విడుదలైన అనంతరం ఇళ్ల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఆగస్టు 27 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా లాటరీ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఇళ్లను కేటాయించనున్నారు.

దీంతో ఇల్లు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. లాటరీ ద్వారా పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here