కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జీవితంలోని కీలక ఘట్టాలను పుస్తక రూపంలో ఆవిష్కరించనున్నారు. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో ఆమె ఆత్మకథ నవంబర్ 10న పాఠకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ (పెంగ్విన్ ర్యాండమ్ హౌస్) ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇప్పటివరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా సోనియా గాంధీ గురించి చాలామందికి తెలుసు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలోని అనేక ఆసక్తికరమైన అంశాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకోనున్నారు.
రాజీవ్‌తో పరిచయం నుంచి భారత్‌కు రాక వరకు..
తన విద్యార్థి దశలో రాజీవ్ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం.. అనంతరం భారత్‌కు రావడం వంటి తన జీవితంలోని ముఖ్యమైన పరిణామాలను సోనియా గాంధీ ఆత్మకథలో వివరించినట్లు ప్రచురణ సంస్థ తెలిపింది.
రాజీవ్ గాంధీతో తన అనుబంధం ఎలా మొదలైంది? వివాహం తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు ఎదురైన అనుభవాలు ఏమిటి? వంటి అంశాలపై పుస్తకంలో ఆసక్తికరమైన వివరాలు ఉండనున్నాయి.
కుటుంబంలో ఎదురైన తీవ్ర విషాదాలు
సోనియా గాంధీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన విషాద ఘటనలకు కూడా ఈ పుస్తకంలో ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. 1984లో తన అత్త, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురికావడం.. ఆ తర్వాత ఏడేళ్లకే 1991లో భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం వంటి ఘటనలు తన జీవితాన్ని ఎలా మార్చాయో ఆమె ఇందులో వివరించనున్నారు.
వ్యక్తిగత జీవితంలోని ప్రేమ, కుటుంబ బంధాలు, విషాదాలు, రాజకీయ ప్రస్థానం వంటి అనేక అంశాలను తనదైన కోణంలో సోనియా గాంధీ ఆత్మకథలో ఆవిష్కరించనున్నారు. దీంతో ఈ పుస్తకంపై రాజకీయ, సాహిత్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





































