ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల్లో సాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో కలిసి దేశంలోనే తొలి నాన్-జీఎంవో పాప్‌కార్న్ హైబ్రిడ్ సీడ్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గోదావరి–కావేరి అనుసంధానంతో మేలు
గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో నదుల అనుసంధానాన్ని కోరుకునే వ్యక్తి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అని కొనియాడారు. ఈ నెలలోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
వ్యవసాయానికి ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు పెద్ద సవాలుగా మారుతున్నాయని, ప్రస్తుతం 52 శాతం వర్షపాతం లోటు ఉందని సీఎం తెలిపారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి నదుల అనుసంధానం ఎంతో అవసరమన్నారు.
పాప్‌కార్న్‌కు ముసునూరు బ్రాండ్‌గా మారాలి
దేశంలో తొలిసారిగా నాన్-జీఎంవో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థను అభినందించారు.
ముసునూరులోని పాప్‌కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోందని చెప్పారు. భవిష్యత్తులో ‘పాప్‌కార్న్’ అంటే ముసునూరు గుర్తుకు వచ్చేలా అభివృద్ధి చేయాలని సూచించారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు ఉత్పత్తులను తీసుకెళ్తే వాటి విలువ అనేక రెట్లు పెరుగుతుందని సీఎం అన్నారు. ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే పాప్‌కార్న్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి
భవిష్యత్తు స్టార్టప్‌లు, ఆవిష్కరణలదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఆధునిక సాంకేతికతతో పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
దేశంలో పాప్‌కార్న్ ఎగుమతులతో 185 మిలియన్ డాలర్ల ఆదా జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మరింత స్థానం కల్పించాలని అన్నారు.
ప్రపంచానికి భారత్ నుంచి ప్రస్తుతం 10 శాతం ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, దాన్ని 50 శాతానికి పెంచితే భారీగా ఉపాధి, ఆదాయం పెరుగుతుందని చంద్రబాబు తెలిపారు.
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త
ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని సీఎం వెల్లడించారు. రాయలసీమలో రూ.లక్ష కోట్లతో చేపట్టే ప్రాజెక్టును వచ్చే డిసెంబర్లో ప్రారంభిస్తామని తెలిపారు. రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే నూజివీడు నియోజకవర్గ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలలో నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని రైతులకు ఏ పంటలు సాగు చేస్తే అధిక ప్రయోజనం ఉంటుందో అవగాహన కల్పిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.







































