సీఎం చంద్రబాబుతో కలిసి హైబ్రిడ్‌ మొక్కజొన్న వంగడం ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌

VP Radhakrishnan and CM Chandrababu Unveils Non-GMO Popcorn Hybrid Seed in AP

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్‌ పాప్‌కార్నికా ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దేశంలోనే తొలి నాన్‌-జీఎంవో పాప్‌కార్న్‌ హైబ్రిడ్‌ విత్తనాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు.

జన్యుపరంగా మార్పులు చేయని ఈ మొక్కజొన్న విత్తనాన్ని పాప్‌కార్న్‌ సాగు కోసం అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ఆదర్శ రైతులను ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి సన్మానించారు. అనంతరం రైతులను ఉద్దేశించి వారు ప్రసంగించారు.

ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో ఒకటి

ముసునూరులో ఏర్పాటు చేసిన గౌర్మెట్‌ పాప్‌కార్నికా ప్లాంట్‌ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్‌ సరఫరా చేయడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది.

అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పాప్‌కార్న్‌ సాగు చేస్తున్న రైతులతో సంస్థ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. రైతులు పండించిన పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్‌, బ్రాండింగ్‌ ద్వారా మార్కెట్‌కు తీసుకెళ్లడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చే దిశగా సంస్థ పనిచేస్తోంది.

రైతులకు మేలు చేసేలా కొత్త వంగడం

రైతులకు మెరుగైన మార్కెట్‌ అవకాశాలు కల్పించడంతో పాటు పాప్‌కార్న్‌ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నాన్‌-జీఎంవో హైబ్రిడ్‌ విత్తనాన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్థానిక రైతులకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో అనుసంధానం పెరగడం ద్వారా ఆదాయ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

అంతకుముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఏలూరు జిల్లా ముసునూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here