నన్ను కాదు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించారు – సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Lashes Out Centre Over Denial of His US Visit

తెలంగాణను ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘వికసిత్‌ భారత్‌ 2047’కు అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ను ప్రకటించామని తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో అంతర్జాతీయ సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేపడుతున్నామని చెప్పారు.

సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించడమే సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు.

కేంద్రాన్ని తప్పుడు సమాచారం

తన అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రానికి ముందుగానే అందించామని సీఎం తెలిపారు. అయితే ఢిల్లీలోని కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించి, తన పర్యటనపై అవాస్తవ సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

బీజేపీ నేతలు తనపై, ప్రభుత్వంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడుల సాధన కోసం గతంలోనూ విదేశీ పర్యటనలు చేపట్టామని, ఈ పర్యటన కూడా పూర్తిగా అధికారికమైనదేనని స్పష్టం చేశారు.

అమెరికా పర్యటన ఎందుకు రద్దు చేశారు?

అమెరికా పర్యటనలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులను కలవనున్నట్లు కేంద్రానికి తెలిపామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా విద్య, క్రీడా రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్చలు జరపాలని భావించామని చెప్పారు.

“ఇంగ్లండ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చారు. అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారు?” అని సీఎం ప్రశ్నించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతి ఇచ్చారని ప్రస్తావిస్తూ.. తన పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

‘నాది చాటుమాటు పర్యటన కాదు’

తనది రహస్య పర్యటన కాదని, పూర్తి అధికారిక పర్యటన అని సీఎం స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను భారత రాయబార కార్యాలయాలు కేంద్రానికి తెలియజేస్తాయని చెప్పారు.

“నా పర్యటనను అడ్డుకోవడమంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. మా లక్ష్యాలను మాత్రం అడ్డుకోలేరు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా కాకుండా ఇప్పటికీ గుజరాత్‌ ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ ఆధిపత్యానికి తన పర్యటనకు అనుమతి నిరాకరించడమే నిదర్శనమని ఆరోపించారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై చిన్నచూపు ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తన అమెరికా పర్యటనను అడ్డుకోవడం వివక్షకు నిదర్శనమన్నారు.

ఈ అంశాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. మెట్రోతో పాటు పలు అభివృద్ధి అంశాల్లోనూ కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదని ఆరోపించారు.

“సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌ అంటే ఇదేనా?” అని సీఎం ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే అభివృద్ధి పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం చూపుతున్న వివక్షను సహించబోమని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here