తెలంగాణలో తమ ప్రభుత్వం పదేళ్ల పోరాటం తర్వాత అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పార్టీ ప్రతిష్టకు ఎలాంటి ఇబ్బంది కలిగించేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాజకీయ వివాదాలు, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం.
బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి
ఒకరిద్దరు కోసం పార్టీని పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించిన ఆయన.. వివాదాలను అధిష్టానానికి వదిలివేయాలని సూచించారు. పార్టీ అంతర్గత అంశాలు, రాజకీయ వివాదాలపై ప్రజాప్రతినిధులు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన వివాదాలు, క్రమశిక్షణకు సంబంధించిన అంశాలను అధిష్ఠానం, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
కొంతమంది నేతల వ్యాఖ్యలు లేదా వ్యవహారశైలి కారణంగా పార్టీకి నష్టం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. పదేళ్లపాటు పార్టీ చేసిన పోరాటం తర్వాత సాధించిన అధికారాన్ని వ్యక్తిగత వివాదాల కారణంగా ఇబ్బందుల్లోకి నెట్టకూడదని నేతలకు సూచించినట్లు సమాచారం.
నియోజకవర్గాల అభివృద్ధిపైనే ఫోకస్
రాజకీయ వివాదాలను పక్కనపెట్టి తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, అటవీ శాఖ అనుమతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ నిధులను ప్రభుత్వం సమకూరుస్తున్న నేపథ్యంలో పనుల్లో జాప్యం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. అభివృద్ధి పనుల పురోగతిని ప్రజలకు చేరవేసేలా ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా సహా వివిధ వేదికల ద్వారా ప్రజలకు విస్తృతంగా వివరించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా నేతలు పనిచేయాలని పేర్కొన్నారు.
పార్టీలో క్రమశిక్షణతో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తే ప్రజల్లో ప్రభుత్వంపై, పార్టీపై విశ్వాసం మరింత పెరుగుతుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.








































